‘రంగారెడ్డి–పాలమూరు’ పనులు వేగవంతం చేయండి

  • మంత్రి ఉత్తమ్​కు  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినతి

పరిగి, వెలుగు: రంగారెడ్డి – పాలమూరు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డిని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరారు. పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, షాద్​నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదివారం ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్​లో ఆయన నివాసంలో కలిశారు. 

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన కొందుర్గు -పరిగి -లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై మంత్రి సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు కాంగ్రెస్ పాలనలో పూర్తవుతుందని  ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు.