అమిత్ షాను బర్తరఫ్ చేయాలి : ఎంపీ మల్లు రవి

అచ్చంపేట, వెలుగు: అంబేద్కర్ కు అవమానం జరిగితే, దేశ ప్రజలందరికీ జరిగినట్లేనని నాగర్ కర్నూల్  ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. హోం మంత్రి అమిత్  షా అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం అచ్చంపేటలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమిత్ షాను కేంద్ర కేబినెట్  నుంచి బర్తరఫ్  చేయాలని డిమాండ్  చేశారు. 

ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన మోడీ సర్కార్  ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్​ కంపెనీల చేతుల్లో పెట్టి, సంపదను అంబానీ, అదానీలకు దోచిపెడుతోందని విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కకు పెట్టి కులం, మతం, ప్రాంతం, దేవుడు, దేశభక్తి పేరుతో తినే తిండిపై ఆంక్షలు విధిస్తూ ప్రజలను రెచ్చగొట్టి ప్రణాళిక ప్రకారం హింసను ప్రేరేపిస్తుందని విమర్శించారు.

వనపర్తి టౌన్: అమిత్  షాను కేంద్రం మంత్రి వర్గం నుంచి తొలగించాలని మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు అంబటి రవి డిమాండ్  చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్​లో అంబేద్కర్ ను ఏకవచనంతో సంభోదిస్తూ అవమానించారన్నారు. అమిత్  షా అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్  వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ  స్పందించకపోగా, శాలువాతో సన్మానించడాన్ని ఖండించారు. సహదేవుడు, నాగరాజు, విజయ్ కుమార్, కురుమూర్తి, నరసింహ, గోవిందు పాల్గొన్నారు.