సమగ్ర సర్వేతో సామాజిక న్యాయం : కాంగ్రెస్​ నేత నీలం మధు

సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి కుటుంబ సర్వేతో బీసీలకు అన్ని అంశాల్లో అవకాశాలు పెరుగుతాయని కాంగ్రెస్ నేత నీలం మధు అన్నారు. శనివారం సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్​లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి నీలం మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వేలో సేకరించిన వివరాలతో ప్రజల ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళిక రూపొందిస్తారన్నారు.

దీనివల్ల స్థానిక ఎన్నికల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు పెరుగుతాయని రాజకీయ అవకాశాలు మెరుగుపడతాయని స్పష్టం చేశారు. బీసీ వర్గాలకు మేలు చేకూర్చేలా నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గం, పీసీసీ అధ్యక్షుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, ఆంజనేయులు, అనంత కిషన్, పులిమామిడి రాజు, శ్రీనివాస్ రెడ్డి, పుష్ప నగేశ్ యాదవ్, వివిధ మండలాల బ్లాక్ అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.