ఎన్ని కుట్రలు చేసినా.. నైతిక విజయం నాదే

ఎన్ని కుట్రలు చేసినా.. నైతిక విజయం నాదే

ఢిల్లీలో చక్రం తిప్పుతానన్న కేసీఆర్ కనీసం బొంగరం కూడా తిప్పలేకపోయారన్నారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి. ఈ ఎన్నికలతో టీఆర్ఎస్ పతనం మొదలైందని ఆయన అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్ధిగా కాంగ్రెస్ తరపున నిలబడి ఓడిన ఆయన శుక్రవారం గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విపరీతంగా మద్యం, డబ్బు పంపిణీ చేసిందని అన్నారు.  పోలీసులతో  తప్పుడు కేసులు పెట్టించి  తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారన్నారు. పోలీసులు కూడా కౌంటింగ్ సెంటర్ల వద్ద ఏజెంట్లలా పని చేశారన్నారు.

తనను రాజకీయంగా హత్య చేయడానికి కేసీఆర్, కేటీఆర్ లు కుట్ర చేశారన్నారు విశ్వేశ్వర రెడ్డి. వారెన్ని కుట్రలు చేసి వారి పార్టీ అభ్యర్ధిని గెలిపించినా.. నైతిక విజయం మాత్రం తనదేనని అన్నారు. తనకు పోయినసారి కంటే ఈ సారి లక్ష ఓట్లు ఎక్కువ పడ్డాయని, రూరల్ లో45,000 ఓట్ల పడ్డాయని ఆయన అన్నారు. తాను ఓడినా కూడా ప్రతిపక్షం తరపున నియోజక వర్గంలో ఉన్న ప్రతి సమస్య మీద పోరాటం చేస్తానన్నారు.

తమ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి గెలిచారని.. విపక్షాల గొంతు పెరగడం వలన ప్రజలకు లాభం జరుగుతుందని విశ్వేశ్వర రెడ్డి ప్రెస్ మీట్ లో అన్నారు.