స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్

  • కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న నేతలు
  • అదిలాబాద్​లో నేడు పార్లమెంటరీ సమావేశం
  • హాజరుకానున్న ఏఐసీసీ సెక్రటరీ దీపాదాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ 

ఆదిలాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీ క్రమంగా బలపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే మొదటిసారిగా జిల్లా కేంద్రంలో సోమవారం ఆదిలాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఏఐసీసీ సెక్రటరీ, తెలంగాణ ఇన్​చార్జి దీపాదాస్ మున్షీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ విశ్వనాథ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క హాజరుకానున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మహేశ్ కుమార్ గౌడ్ మొదటి సారి ఈ సమావేశానికి హాజరుకానున్నారు. దీంతోపాటు మంత్రి సీతక్క జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ, శంకుస్థాపనలు చేయనున్నారు. ఒకే రోజు ఇటు పార్టీ మీటింగ్.. అటు సీతక్క పర్యటన ఉండటంతో పార్టీ సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది. 

ఎక్కువ స్థానాల్లో గెలిచేలా..

ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని భావిస్తోంది. పదేండ్ల తర్వాత అధికారంలోకి రావడంతో అధిష్టానం పార్టీకి గత వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ కార్యక్రమాలు విస్త్రతంగా చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రస్తుతం ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్​కు ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యేగా వెడ్మ బొజ్జు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Also Read :- ఫామ్​హౌస్​లో పడుకునే కేసీఆర్​కు ప్రతిపక్ష నేత పదవెందుకు

 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి ఎన్నికలు జరుగలేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్ని కల్లో పార్టీ ఎక్కువ స్థానాలు గెలవాలని భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతమైంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పెద్ద ఎత్తున ఇతర పార్టీల సెకండ్ క్యాడర్ లీడర్లు సైతం కాంగ్రెస్​లో చేరడంతో మరింత బలంగా కనిపిస్తోంది. 

పార్టీలో జోష్..

కాంగ్రెస్ పార్లమెంట్ స్థాయి సమావేశానికి పార్టీ అగ్రనేతలు తరలిరానున్న నేపథ్యంలో కార్యకర్తల్లో జోష్​కనిపిస్తోంది. సమావేశంలో కాంగ్రెస్​బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నిల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 

అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఈ స్థాయిలో కాంగ్రెస్ సమావేశం నిర్వహిచడంతో కార్యకర్తలు సైతం ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఈ సమావేశానికి ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్, మహిళా విభాగం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సేవాదళ్ నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఇప్పటికే పిలుపునిచ్చారు.