జీవో 317 బాధితులకు  ప్రజా ప్రభుత్వమే న్యాయం చేయాలి

గత ప్రభుత్వం తీసుకువచ్చిన యమపాశం వంటి జీవో 317. ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సబ్ కమిటీ తుది నివేదికను ముఖ్యమంత్రికి  రేవంత్ రెడ్డికి  అందజేయడం జరిగింది. అయితే అసలు ఈ నివేదికలో 317 జీవో బాధితులకు అసలైన న్యాయం జరగబోతుందా? జిల్లాలు మారి దూర ప్రయాణాలు చేస్తూ ఆరోగ్యాలు క్షీణించి మరణాలు సంభవించి ఉద్యోగ జీవితంలో అష్టకష్టాలు అనుభవిస్తున్న అసలైన బాధితుడు తన గూటికి చేరేనా?  కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి జీవో 317 సబ్ కమిటీ తుది నివేదికను ప్రవేశపెట్టి మంత్రులందరి సమ్మతితో అన్ని శాఖల వారీగా బాధితులను వారి వారి జిల్లాలకి చేర్చి న్యాయం చేయబోతున్నట్టు సమాచారం.

కానీ న్యాయం స్పౌజ్, మ్యూచువల్, మెడికల్ వారికి మాత్రమే అని మంత్రులు సదరు 317 బాధితులు కలిసినప్పుడు తెలియజేసిన్నట్లు తెలిసింది. నిజానికి స్పౌస్​ సమస్య కేవలం జీవో త్రీ వన్ సెవెన్ వల్ల ఉత్పన్నమైంది కాదు. అది ఎప్పుడూ  కొనసాగేది. ఎందుకంటే మరో డిఎస్సీ వస్తుంది. ఆ డీఎస్సీలో వేరువేరు జిల్లాలో ఉద్యోగాలు సంపాదిస్తారు. ఆ తర్వాత భార్యాభర్తలను ఒక దగ్గర చేర్చాలి అంటూ మళ్లీ అప్పీల్ చేసుకుంటారు. ఇలా ప్రతి  డీఎస్సీకి ఈ తంతు మామూలే.

 డిస్​లోకేటెడ్​ బాధితులకు న్యాయం చేయాలి

జీవో 317 బాధిత మహిళలం కొంతమంది సెక్రటేరియట్​కి వెళితే వారు మాకు మాటిచ్చారు.  ఆరోజు జీవో 317 సబ్ కమిటీ మంత్రి ఒకరు అందుబాటులో ఉన్నారు. సదరు మంత్రి మమ్మల్ని కాన్ఫరెన్స్ హాల్​కు పిలిపించి అసలు సమస్య ఇది అని వెలిబుచ్చడం జరిగింది. అదేంటంటే ..‘ఉమ్మడి జిల్లా పరిధిలో జిల్లాలు మారిన ఉద్యోగ ఉపాధ్యాయులను వారి వారి జిల్లాలకి చేర్చడానికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేవు. ఎవరైతే అంతకుముందు నుంచి అదే జిల్లాలో కొనసాగుతూ మళ్లీ 317 ద్వారా అదే జిల్లాకు కేటాయించినవారికి న్యాయపరమైన చిక్కులు వస్తున్నవి. ఆ చిక్కులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి,  

రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి, సుప్రీంకోర్టులో వాదనలు జరగాలి’ అని సదరు 317 సబ్ కమిటీ మంత్రివర్యులు మాకు వివరించడం జరిగింది. అప్పుడు మేం నిజానికి త్రీ వన్ సెవెన్ జీవో ద్వారా జిల్లాలు మారి ప్రయాణాలు చేస్తూ ఆశతో ఎదురుచూస్తున్న వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అని తెలియచేశాం. వారి బాధ వర్ణనాతీతం. మరణాలు కూడా ఇలా జిల్లాలు మారినవారికి సంభవించాయి, సర్వత్రా నష్టపోయింది కూడా జిల్లాలు మారినవాళ్లే  అని 
వివరించాం. అప్పుడు మంత్రి వీరిని ప్రభుత్వం త్రీ వన్ సెవెన్  డిస్​లొకేటెడ్ బాధితులుగా గుర్తించింది. వీరిని సత్వరమే పంపించే ప్రయత్నం మేం తప్పకుండా చేస్తాం. ఎందుకంటే వీరికి న్యాయపరమైన చిక్కులు లేవు. మాకు వీరి పట్ల సానుభూతి ఉంది అని తెలియజేయడం జరిగింది.

మరోమారు విన్నపం

85 శాతం జిల్లాలు మారినవాళ్లే ఉన్నారు. వారికి న్యాయం  జరిగితే  చాలావరకు 317 జీవో సమస్యను  కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినట్టే. 317 బాధితునికి న్యాయం జరిగినట్లే. కావున ముందుగా వీరిని ఒక విడతలో వారి వారి జిల్లాలకు పంపాలి. ఎవరికైతే న్యాయపరమైన చిక్కులు కలవో వారికి కూడా గట్టి హామీ ఇస్తూ ప్రాసెస్​ని ముందుకు జరుపుతూ ఈ త్రీ వన్ సెవెన్ సమస్యను పరిష్కరించాలని ఒక రాష్ట్ర నాయకురాలిగా వేడుకోవడం జరిగింది. ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకి  సరైన న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి.  317 జీవో  వల్ల జిల్లాలు మారి  అనాథగా మారిన ఉద్యోగి, ఉపాధ్యాయులకు  తప్పక న్యాయం చేసి తీరాలి.  ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో  .. అష్ట కష్టాలు అనుభవిస్తున్న 317 బాధితులకి సరైన న్యాయం చేయాలి.  బాధితులను వారి వారి స్థానిక జిల్లాలకు చేర్చాల్సిందిగా మరోమారు విన్నవిస్తున్నాం. 

విజయబావుటా వెనుక నిలిచింది బాధితులే

అసలైన 317 బాధితులు వారి జిల్లా నుంచి గెంటి వేయబడిన సగటు ఉద్యోగులు. వేరే జిల్లాలో వందలకొద్దీ  కిలోమీటర్లు  ప్రయాణిస్తూ అలసి సొలసిపోతున్న సామాన్య ఉద్యోగులు. ఉద్యమం చేసింది..పోరాటం నడిపింది కూడా ఈ సగటు ఉద్యోగులే.  వీరి మద్దతుతో ఎన్నికల్లో  విజయబావుటా ఎగురవేసినవారు  న్యాయం చేయాలని ఆశిస్తున్నాం.  317 జీవో బాధితులందరూ గాంధీ జయంతి నాడు గాంధీ భవనం ఎదురుగా శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆరోజు గాంధీభవన్​లోకి   కొంతమంది జీవో 317 లీడర్స్​ని  పిలిపించుకొని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ , కొండా సురేఖ,  పొన్నం ప్రభాకర్, బల్మూరి వెంకట్..  త్రీ వన్ సెవెన్  లీడర్లతో చర్చలు జరపడం జరిగింది.  ఆరోజు నేను బతుకమ్మ పండుగ  కానుకగా..మా ఆడబిడ్డలకు మా అన్నదమ్ములకు దసరా కానుకగా  మా ఇంటికి చేర్చండి. మా జిల్లాలకు పంపండి అని వేడుకోవడం జరిగింది. 

- వై.రత్నమాల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డిస్​లొకేటెడ్ (317జీవో) , ఉపాధ్యాయ ఉద్యోగుల సంఘం-