నల్గొండలో 80,275 మంది రైతులు..రూ.645 కోట్ల రుణమాఫీ

  • 2018-23 వరకు రూ.258.47 కోట్లు మాఫీ
  • 2024లోనే రూ.645 కోట్లు మాఫీ
  • 708 మందికి మాఫీ కాలే

యాదాద్రి, వెలుగు : రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్​ సర్కారు స్పీడ్​గా వ్యవహరిస్తోంది. రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్​ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. విడతల వారీగా రుణాలను మాఫీ చేసింది. సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి మాఫీ కాలేదు. ఆ సమస్యను పరిష్కరించి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.   

మూడేండ్లలో 46,509 మందికే..

రైతుల రుణాలు మాఫీ చేస్తామని 2018 ఎన్నికల ముందు బీఆర్ఎస్ చెప్పింది. అప్పటి లెక్కల ప్రకారం 2018 నుంచి సెప్టెంబర్​ 2023 వరకు యాదాద్రి జిల్లాలోని వివిధ బ్యాంకులతోపాటు ఇతర ప్రాంతాల్లోని బ్యాంకుల్లో జిల్లాకు చెందిన రైతులు లోన్లు తీసుకున్నారు. జిల్లాకు చెందిన 1,13,442 మంది రైతులు రూ.629.66 కోట్లు లోన్లు తీసుకున్నారు. రూ.25 వేలు, రూ.50 వేలు, రూ.లక్ష లోన్​తీసుకున్న వారిలో 46,509 మందికి రూ.258.47 కోట్లు మాఫీ చేసిందని ఆఫీసర్లు చెబుతున్నారు. మిగిలిన వారికి వివిధ కారణాల వల్ల మాఫీ కాలేదు. 

ఏడాదిలోనే 80 వేల మందికి పైగా..

ఎన్నికల సందర్భంగా రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ చేస్తామని కాంగ్రెస్​ చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విడతలవారీగా లోన్లు మాఫీ చేసింది. మొదటి విడతలో 36,483 మంది రైతులకు రూ.199.87 కోట్లు మాఫీ చేసింది. 

అయితే వీరిలో వివిధ కారణాల వల్ల 36,001 మందికే రూ.197.88 కోట్లు మాఫీ అయింది. 482 మందికి చెందిన 1.98 కోట్లు మాఫీ కాలేదు. రెండో విడతలో 19,798 మందికి రూ.193.45 కోట్లు మాఫీ చేసింది. వీరిలో 19,660 మందికి రూ.192.10 కోట్లు మాఫీ కాగా, 138 మందికి సంబంధించి రూ.1.35 కోట్లు మాఫీ కాలేదు. మూడో విడతలో 13,011 మందికి రూ.164.66 కోట్లు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. వీరిలో 12,293 మందికి 163.83 కోట్లు మాఫీ కాగా 88 మందికి సంబంధించి రూ.83 లక్షలు మాఫీ కాలేదు. నాలుగో విడతలో 11,691 మందికి రూ.111.65 కోట్లు మాఫీ చేస్తున్నట్టు సర్కారు ప్రకటించింది. 

సాంకేతిక కారణాలతో..780 మందికి..

ప్రభుత్వం రుణమాఫీ కార్యక్రమం కొనసాగిస్తున్నా.. కొందరికి ఫలితాలు అందలేదు. సాంకేతిక కారణాల వల్ల 780 మంది రైతులకు మాఫీ వర్తించలేదు. లోన్లు తీసుకున్న రైతుల్లో కొందరు వడ్డీ పెరుగుతుందన్న భయంతో రుణాలు చెల్లించారు. దీంతో వారి రుణ ఖాతా క్లోజ్ అయిన కారణంగా డీబీటీ ఫెయిలై రుణమాఫీ వర్తించలేదు. అయితే లీస్ట్​లో పేరు ఉండి మాఫీ కాని రైతుల కోసం అగ్రికల్చర్ డిపార్ట్​మెంట్ గ్రీవెన్స్​నిర్వహించింది.

ఇప్పటికే దాదాపు 4,300 మంది రైతులు గ్రీవెన్స్​ను ఆశ్రయించారు. దీంతోపాటు బ్యాంకుల్లో ఆధార్ నంబర్లు తప్పుగా నమోదు చేయడంతోపాటు ఒకే నంబర్​ను ఇద్దరికి నమోదు చేశారు. లోన్​ఖాతాలో ఒకరకంగా, సేవింగ్​అకౌంట్​లో మరో రకంగా రైతుల పేర్లు ఉండడం వల్ల మాఫీ ఫలితం దక్కలేదు. అయితే అర్హత కలిగిన ప్రతి రైతుకు రుణమాఫీ ఫలితాలు అందుతాయని ఆఫీసర్లు చెబుతున్నారు.