ఏడాదిలో పాలనలోనే అన్నిరంగాల్లో విప్లవాత్మక మార్పులు

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏడాది కాలంలోనే అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తూ ఎన్నో  రికార్డులను తిరగరాసింది. కేసీఆర్​ నియంతృత్వ పాలనను బద్దలుకొట్టి అధికారంలోకి  వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం  ఏడాది కాలంలోనే  చరిత్రాత్మక పనులు చేపట్టింది. ప్రతిరోజూ 18 గంటల పాటు సీఎం రేవంత్​రెడ్డి, మంత్రులు కష్టపడడం వల్లే  తెలంగాణకు మంచి రోజులు వస్తున్నాయి.   వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపిస్తున్నారు.  2 లక్షల వరకు ఉన్న రుణాలను  నాలుగు విడతల్లో  కలిపి 25,35,964 రైతు కుటుంబాలకు  రూ.20,616.89 కోట్ల రుణమాఫీ చేశారు. అదేవిధంగా ఏడాదికాలంలోనే దాదాపు 50వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. 75 ఏండ్ల స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో ఏడాదిలోనే దాదాపు రూ.21వేల కోట్ల రుణమాఫీ, 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.  ప్రతి నెలా ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందుతున్నాయి.  బీఆర్ఎస్​ పదేండ్ల కాలంలో  చేసిన ఏడు లక్షల కోట్ల అప్పులకు ఇప్పటివరకు మిత్తి కింద రూ.60 వేల కోట్లు కాంగ్రెస్​ ప్రభుత్వం చెల్లించింది.  

రూ.1.73  కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. రూ.500కు గ్యాస్ సిలిండర్ అందిం చడంతోపాటు 200 యూనిట్లలోపు పేదలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నది.  పదేండ్ల కాలంలో బీఆర్ఎస్​ పెంచని హాస్టల్​ విద్యార్థులకు డైట్ చార్జీలు 40% పెంచి రికార్డు సృష్టించింది. ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కలను  ప్రజా పాలన నెరవేర్చనుంది. రాష్ట్రంలో ఉన్న కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రుణాలు అందిస్తున్నది.  సమగ్ర కుల సర్వేను ప్రభుత్వం చేపట్టింది. దీంతో అన్ని కులాలకు తగిన న్యాయం జరగనుంది. దళిత, గిరిజన, ఓబీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రపంచస్థాయి సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్​ కొత్త క్యాంపస్‌‌‌‌‌‌‌‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 

రైతు సంక్షేమం కాంగ్రెస్ పేటెంట్​

 నెహ్రూ ప్రధానిగా పని చేసిన కాలం నుంచి కాంగ్రెస్ పాలనలో కట్టిన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, జూరాల,  శ్రీశైలం ప్రాజెక్టులు  ఎంత వరద వచ్చినా  తట్టుకొని నిటారుగా నిలబడి  నేటికీ  రైతులకు  సాగు నీటిని అందిస్తున్నాయి.  కానీ,  రూ. 1.02 లక్షల కోట్లు ఖర్చు చేసిన అపర మేధావి కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం కుప్పకూలింది.  కాళేశ్వరం నుంచి చుక్కనీరు రాకున్నా..  తెలంగాణలో 66 లక్షల పైచిలుకు ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. భార తదేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించారు. గత  బీఆర్ఎస్​ ప్రభుత్వం ‘వరి వేస్తే.. ఉరి' అని చెప్పింది.  కాంగ్రెస్​ సర్కారు వరిని ప్రోత్సహించి రూ.500 బోనస్ అందజేస్తున్నది.  బీఆర్​ఎస్​ ప్రభుత్వం ప్రాజెక్టులకు రూ.183 లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసింది. ఫలితం శూన్యం.  రైతులకు హరిత విప్లవం తెచ్చిందే కాంగ్రెస్.  సాగునీరు, ఉచిత విద్యుత్, రాయితీతో  ఎరువులు, పంటలకు మద్దతు ధర, ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించడం దాకా కాంగ్రెస్ పార్టీయే అమల్లోకి తెచ్చింది. 

Also Read : బంగ్లాదేశ్​లో పెను సంక్షోభం..మైనారిటీల్లో ఆందోళన

విద్యారంగానికి ప్రాధాన్యం

గత బీఆర్​ఎస్​ పాలకులు విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏడాదికాలంలోనే విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన  మార్పులు తీసుకొచ్చింది.  ఈ ఏడాది బడ్జెట్లో విద్యా శాఖకు రూ.21,292 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.  పాఠశాలల్లో మౌలిక వసతులకు రూ.1,100 కోట్లు ఖర్చు చేశారు.  రెండు దశాబ్దాలుగా పెండింగ్​లో  ఉన్న ఉపాధ్యాయులకు సర్కారు పదోన్నతులు కల్పించింది. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసింది సర్కారు. ఏటా రెండు సార్లు టెట్ నిర్వహిస్తున్నది. పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నాణ్యమైన విద్య అందించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.  65 ఐటీఐలను రూ.2,106 కోట్ల వ్యయంతో ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఐటీసీ)లుగా మార్చారు.  యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించారు. యువత ఆధునిక నైపుణ్యాలు నేర్చుకొని ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా ఈ స్కిల్ 
యూనివర్సిటీ, ఏటీసీలను తీర్చిదిద్దనున్నారు. 

వైద్య రంగం ప్రక్షాళన

 ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే వైద్యారోగ్య శాఖపై ఏకంగా రూ.10 వేల కోట్లు ఖర్చుచేసింది. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి వ్యక్తికి పది లక్షల రూపాయల విలువైన ఉచిత వైద్యం అందేలా కృషి చేస్తున్నది.  ఏడాదిలోనే ఆరోగ్య శాఖలో 14వేల ఉద్యోగాలను భర్తీ చేశారు. కొత్తగా 213 కొత్త అంబులెన్స్​లను సీఎం ప్రారంభించారు. వీటితో కలిపి రాష్ట్రంలో అంబులెన్స్​ల సంఖ్య 790 నుంచి 1003కి పెరిగింది.  ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఒక్కో కాలేజీలో 50 సీట్ల చొప్పున, మొత్తం 400 ఎంబీబీఎస్ సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి.  కొత్తగా 50 పీజీ సీట్లు మంజూరయ్యాయి. వీటితో కలిపి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల సంఖ్య 1191కు చేరింది. 6,956 నర్సింగ్ ఆఫీసర్  పోస్టులను భర్తీచేసింది. 16 నర్సింగ్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 960 సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. 28 పారా మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రారంభించింది.  వైద్య రంగాన్ని సర్కారు ఆధునీకరించింది. 

పెట్టుబడులకు స్వర్గధామం..

 కొద్ది నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి,  పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​ బాబు, అధికారుల బృందం అమెరికా, సౌత్​ కొరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా దిగ్గజ కంపెనీల పారిశ్రామికవేత్తలతో అనేక ఒప్పందాలు చేసుకున్నారు. ఇందుకుగాను దాదాపు 35వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఒప్పందాలు పూర్తి చేసుకున్నారు. వీటి వల్ల దాదాపు 30వేల నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగునున్నాయి.

వేల కోట్లతో హైదరాబాద్ అభివృద్ధి

హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్​ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్సిటీ) ప్రాజెక్టులో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో రూ.3,446 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ పనులకు ఈ నెల 3న ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి శంకుస్థాపన చేశారు. వంతెనలు, అండర్​పాస్​లు, కారిడార్ల అభివృద్ధి, నాలాల విస్తరణ, 
రీ మోడలింగ్ వంటి పనులను హెచ్సిటీలో భాగంగా చేపడుతున్నారు. గ్రేటర్​లోని ప్రధాన కూడళ్లు, రహదారులపై రూ.150 కోట్లతో సుందరీకరణ పనులు చేపడుతున్నారు. రోడ్లపై వరద నీరు నిలవకుండా ప్రధాన రహదారుల్లోని 12 ప్రాంతాల్లో రూ.16.50 కోట్లతో నీటి సంపులను నిర్మిస్తున్నారు.  హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేసి చెరువులు, కుంటలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం నడుం బిగించింది. మూసీ నదిని అంతర్జాతీయంగా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సర్కారు ముందుకు సాగుతున్నది.  దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద క్రీడా విశ్వవిద్యాలయం హైదరాబాద్​లో ఏర్పాటు చేస్తున్నారు. 
హైదరాబాద్​లో బాపూ ఘాట్ ప్రాంతంలో అతిపెద్ద గాంధీ  విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.  హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ సరసన ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయనున్నారు. 

- వెలిచాల రాజేందర్​రావు,
కాంగ్రెస్​పార్టీ కరీంనగర్​ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్​చార్జ్​