ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆరోపించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రపతి ఎన్నికలకు ముందు రోజు కర్ణాటక బీజేపీ మంత్రులు, సీనియర్ నేతలు 5 స్టార్ హోటల్‌లో బస చేశారని, శిక్షణా కార్యక్రమం పేరుతో ఖరీదైన రూమ్‌లను బుక్ చేసుకొని, మందు, విందు కోసం భారీగా ఖర్చు చేశారని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత సిద్ధరామయ్య, ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తమ ఫిర్యాదులో ఆరోపించారు.
జులై 18న ఓటింగ్ కోసం కర్నాటక మంత్రులందరూ తమ ఎమ్మెల్యేలను బీఎంటీసీ ఎయిర్‌కండిషన్డ్ బస్సులో హోటల్ నుంచి విధానసౌధకు తీసుకువెళ్లారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవన్నీ ద్రౌపది ముర్ము గెలుపును ప్రభావితం చేసేందుకు ఓటర్లను (ఎమ్మెల్యేలను) ప్రలోభ పెట్టడమేనని ఫిర్యాదులో వెల్లడించారు. ఈ చర్యలన్నీ ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా బీజేపీ జోక్యం చేసుకోవడం కిందకే వస్తాయని, ద్రౌపది ముర్ముకు అనుకూలంగా పోలైన అన్ని ఓట్లను చెల్లనివిగా పరిగణించేలా రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ఆదేశించాలని కోరారు.
ద్రౌపది ముర్ముతో పాటుగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రాష్ట్ర అధ్యక్షుడు నలిన్ కుమార్ కటీల్, బీఎస్ యడియూరప్ప, విప్ సతీష్ రెడ్డిపై కేసులను ఈసీ నమోదు చేయాలని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఫిర్యాదులో కోరింది.
