మన్మోహన్​సింగ్​ మృతిపై కాంగ్రెస్​ రాజకీయం : బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​రెడ్డి

  • నాడు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు రాహుల్​ అవమానించిండు
  • ఇప్పుడు దొంగ ప్రేమ ఒలకబోస్తున్నడు: కిషన్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు:  మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తున్నదని, దీన్ని చూసి దేశ ప్రజలు బాధపడుతున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘దేశ ప్రజలందరూ గౌరవించుకునే వ్యక్తిపై కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడం సిగ్గు చేటు. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కారహీనానికి అద్దం పడుతున్నది” అని విమర్శించారు. వాజ్ పేయికి స్మారక కేంద్రాన్ని నిర్మించినట్లుగానే మన్మోహన్ సింగ్​కు కూడా స్మారక కేంద్రాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.

గతంలో మాదిరిగానే ట్రస్ట్ పేరుతో భూమిని ట్రాన్స్ ఫర్ చేసి స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్, పాల్వాయి హరీశ్​ తదితరులతో కలిసి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వాజ్ పేయి పార్థివదేహానికి ఏవిధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారో, మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి అదేవిధంగా అంత్యక్రియలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, ఆ బాధ్యతను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అప్పగించిందని తెలిపారు. ప్రధాని మోదీ స్వయంగా మన్మోహన్ కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు కేబినెట్ మంత్రులు అంతిమ సంస్కార కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పారు. 

న్యూ ఇయర్​ వేడుకల్లో రాహుల్​

ఇటీవల రాహుల్ గాంధీకి ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం, దుందుడుకుతనంతో వ్యవహరించడం, చివరికి బోర్లా పడటం అలవాటైందని కిషన్​రెడ్డి విమర్శించారు.  ‘‘పీవీ నర్సింహారావు, ప్రణబ్ ముఖర్జీ విషయంలో కాంగ్రెస్​ పార్టీ అవమానకరంగా వ్యవహరించింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా కుటుంబం ఏ విధంగా అవహేళన చేసిందో ప్రజలందరికీ తెలుసు” అని కిషన్​రెడ్డి వ్యాఖ్యానించారు.  

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఢిల్లీలో మరణిస్తే సాధారణ నాయకులకు దక్కిన గౌరవాన్ని కూడా ఆయన దక్కకుండా అవమానపర్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు. ‘‘నాడు కాంగ్రెస్​ ప్రభుత్వం పీవీ స్మారక కేంద్రాన్ని నిర్మించలేదు. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం పీవీని భారతరత్నతో గౌరవించింది” అని తెలిపారు. మన్మోహన్ సింగ్ మృతికి ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తే.. కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు వియత్నాం వెళ్లారని కిషన్​రెడ్డి దుయ్యబట్టారు.