క్విడ్ ప్రో కోపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్!

  • ఫార్ములా- ఈ రేస్ నిర్వహించిన గ్రీన్ కో ద్వారా బీఆర్ఎస్​కు రూ. 41 కోట్ల ఎలక్టోరల్​ బాండ్స్​: కాంగ్రెస్​
  • సమస్యలను డైవర్ట్ చేసేందుకే ​ గ్రీన్ కో అంశాన్ని కాంగ్రెస్​ తెరపైకి తెచ్చింది: బీఆర్ఎస్​
  • పోటాపోటీ ఆరోపణలతో హీటెక్కిన పాలిటిక్స్​

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా–ఈ రేస్​లో కొత్త ట్విస్ట్ బయటపడింది. బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో కంపెనీ  ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసి ఇచ్చిన అంశం వెలుగు చూడడంతో ఒక్కసారిగా కేసు వ్యవహారం మలుపు తిరిగింది. ఈ ఎలక్టోరల్​ బాండ్ల వ్యవహారం కాస్త ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్​ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. చేసిన మోసాలను, దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు, ఫార్ములా–ఈ రేస్ కేసును​ పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు​ బురద జల్లుతున్నారని కాంగ్రెస్​ లీడర్లు విమర్శిస్తున్నారు. ఫార్ములా–ఈ రేస్ నిర్వహించిన గ్రీన్ కో కంపెనీ, దాని అనుబంధ కంపెనీలు బీఆర్ఎస్​ పార్టీకి ఎన్నికల బాండ్లతో కోట్ల రూపాయలు అందాయని, ఇది క్విడ్ ప్రో కో వ్యవహారమని కాంగ్రెస్​ ఆరోపించింది. 

రేసు నిర్వహించిన గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆర్ఎస్‌‌కు కోట్లాది రూపాయల లబ్ధి చేకూరినట్టు వెల్లడించింది. ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి రూ.41 కోట్లు వచ్చినట్టు తేల్చింది. దీనిపై  ఫార్ములా–ఈ రేస్​ కేసులో ఉన్న మాజీ మంత్రి కేటీఆర్​ స్పందించారు. 2022 ఏడాదిలో బీఆర్ఎస్​ పార్టీకి గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది నిజమేనని చెప్పారు. అయితే, 2023లో ఫార్ములా–ఈ రేస్​ జరిగిందని తెలిపారు. కాగా, బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు ఏకంగా 41 సార్లు ఎన్నికల బాండ్ల రూపంలో ఫండ్స్​ చెల్లించాయి. 2022లో  రేస్‌‌కు సంబంధించిన చర్చలు మొదలైనప్పటి నుంచి గ్రీన్ కో సంస్థ ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది.  ప్రతిసారి రూ.కోటి విలువ చేసే బాండ్లు కొన్నది. 2022 ఏప్రిల్ 8 నుంచి అక్టోబర్ 10 మధ్య ఈ బాండ్లను కొనుగోలు చేయగా.. బీఆర్ఎస్ పార్టీకి రూ.41 కోట్లు అందాయి. 

సమస్యలను డైవర్ట్ చేసేందుకే గ్రీన్ కో అంశం: కేటీఆర్

 రాష్ట్రంలోని సమస్యలను డైవర్ట్ చేసేందుకే ప్రభుత్వం గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లను తెరపైకి తెచ్చిందని బీఆర్‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్రీన్ కో బాండ్లు ఎప్పుడు ఇచ్చింది? ఈ రేస్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? అని ప్రశ్నించారు. లీకులు ఇచ్చే వాళ్లకైనా సోయి ఉండాలి కదా అని అన్నారు. గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చింది 2022లో అయితే.. ఫార్ములా–ఈ రేస్ జరిగింది 2023లో అని చెప్పారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు. గ్రీన్ కో సంస్థ కాంగ్రెస్, బీజేపీకి కూడా ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిందని చెప్పారు. పార్లమెంట్ ఆమోదించిన బాండ్లను అవినీతి అని ఎలా అంటారని ప్రశ్నించారు. 

దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై చర్చకు సిద్ధమని అన్నారు. రేస్​ కారణంగా గ్రీన్ కో నష్టపోయిందని చెప్పారు. రైతుభరోసా అంశంపై మీడియా దృష్టి పెట్టాలని కోరారు. ఇదిలా ఉంటే 340 కంపెనీలు- 1,351 కోట్లు  అల్ ఇండియా కాంగ్రెస్​కు ఎలక్ట్రోల్ బాండ్లు ఇచ్చాయంటూ బీఆర్ఎస్​ ఒక లిస్ట్​ను రిలీజ్​ చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై అన్ని రాష్ట్రాల ఏసీబీ కన్నేయాల్సిందేనా? అని అందులో ప్రశ్నించారు. పార్లమెంట్ ఆమోదించిన ఎలక్ట్రోల్ బాండ్లపై తెలంగాణలో తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్.. వారి పార్టీకి దక్కిన వేల కోట్లపై ఏమంటుందంటూ సోషల్​ మీడియాలో బీఆర్ఎస్​ప్రచారం చేస్తున్నది. 

కాంగ్రెస్‌‌కూ గ్రీన్‌‌ కో విరాళాలు: జగదీశ్ రెడ్డి

కాంగ్రెస్‌‌కూ  గ్రీన్‌‌ కో సంస్థ ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిందని, అదో పనికిమాలిన అంశమని బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. ఫార్ములా–ఈ కేసే చెత్త కేసు అని పేర్కొన్నారు. కేటీఆర్ ఓ హీరోలా ఏసీబీ విచారణకు హాజరయ్యారని చెప్పారు. ఇప్పుడు జరిగే విచారణలన్నీ తోలు బొమ్మలాటలేనని అన్నారు. రైతుభరోసా విషయంలో రైతుల ఆగ్రహం నుంచి దృష్టి మళ్లించేందుకు కేటీఆర్‌‌కు ఏసీబీ నోటీసులు ఇప్పించారని, రేవంత్‌‌వి చిల్లర చేష్టలని అన్నారు. ఏసీబీ ఆఫీసు వద్ద 45 నిమిషాల పాటు కేటీఆర్‌‌ను బయట నిలబెట్టారని, విచారణాధికారే కేటీఆర్ దగ్గరకు వచ్చి లేఖ తీసుకోవడంతో రేవంత్ బొక్కబోర్లా పడ్డారన్నారు. వ్యూహం బెడిసికొట్టేసరికి ఎలక్టోరల్ బాండ్లను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. 

సోమవారం ఆయన తెలంగాణ భవన్‌‌లో మీడియాతో మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్స్ పబ్లిక్ డొమెయిన్‌‌లో ఉన్నవే కదా? అని ప్రశ్నించారు. ‘‘గ్రీన్ కో కంపెనీ అన్ని పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది. కాంగ్రెస్‌‌కు కూడా రూ.27 కోట్ల విరాళాలు ఇచ్చింది. రేవంత్ తన పరువు పోతుందని ఈ డైవర్షన్ రాజకీయం తెరపైకి తెచ్చారు. ఏసీబీ హైకోర్టు ముందుంచిన 200 పేజీల రిపోర్ట్​లో గ్రీన్ కో ప్రస్తావన ఎందుకు లేదు? ఫార్ములా వన్‌‌కు ముందే గ్రీన్ కో ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చింది. చాలా కంపెనీలు చాలా పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చాయి. ఇందులో దాపరికం లేదు. గ్రీన్ కో బాండ్ల అంశం పనికిమాలినది” అని వ్యాఖ్యానించారు. 

దోపిడీని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్​ తప్పుడు ప్రచారం: కాంగ్రెస్​ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి  

దోపిడీని కప్పిపుచ్చుకోవడం కోసం రైతు భరోసాపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్​ ఎమ్మెల్యే  మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్​కు రైతులపై ప్రేమ లేదని, ఫార్ములా ఈ రేస్ విచారణ ను పక్కదోవ పట్టించడం కోసమే రైతు ధర్నాలకు   పిలుపునిచ్చారని అన్నారు. సీఎల్పీలో మధుసూదన్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోసాలు బయటపడుతాయనే కేడీ  కేటీఆర్​ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గ్రీన్​  కో అనే కంపెనీ రూ.41 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీ కి విరాళంగా ఇచ్చిందని, ఫార్ములా– ఈ రేస్ లో స్పాన్సర్ కంపెనీ గా గ్రీన్ కో ఉందన్నారు. 

ALSO READ : క్వాష్​ పిటిషన్​పై హైకోర్టు తీర్పు రావాల్సి ఉంది.. నాకు టైమ్​ ఇవ్వండి: కేటీఆర్​

రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వం రూ. 53,758.27 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. మొత్తం 25,35,963 మంది రైతులకు రూ. 20,616.89 కోట్లు చెల్లించి, రుణ విముక్తి చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీలకు రూ.12వేల నగదు సాయం చేస్తామని చెప్పారు. వ్యవసాయ ఉచిత విద్యుత్ కు రూ.10,444 కోట్లు అందించామని, సన్నవడ్లకు రూ.500 చొప్పున రైతులకు బోనస్ రూ. 1,080 కోట్లు ఇచ్చినట్టు వివరించారు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంట నష్టపోయిన రైతుకు కనీసం పరిహారం కూడా ఇవ్వలేదని, బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు.  పదేండ్లలో కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.22 వేల కోట్లు చెల్లించిందని అన్నారు. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా ప్రకటించినందుకు సీఎం రేవంత్​కు ధన్యవాదాలు తెలిపారు.