బీజేపీ, కాంగ్రెస్ ఫైటింగ్.. రెండు పార్టీల ఆఫీస్​ల వద్ద టెన్షన్​..

  • రెండు పార్టీల ఆఫీస్​ల వద్ద టెన్షన్​.. బీజేపీ స్టేట్​ఆఫీస్​ ముట్టడికి యూత్​ కాంగ్రెస్​ యత్నం.. కోడిగుడ్లు, కర్రలతో దాడులు
  • గాంధీభవన్కు ర్యాలీగా వెళ్లిన బీజేపీ నేతలు
  • అడ్డుకున్న పోలీసులు.. కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించివేత
  • ప్రియాంక గాంధీపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత రమేశ్ బిధూరి చేసిన కామెంట్లను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు చేపట్టిన బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఆ పార్టీ ఆఫీస్ ముందు రమేశ్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. తర్వాత బీజేపీ ఆఫీస్​పై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. దీంతో బీజేపీ నేతలు ప్రతిదాడులకు దిగారు. కర్రలు, రాళ్లతో కాంగ్రెస్ నేతలపై దాడి చేశారు. తర్వాత బీజేపీ నేతలంతా గాంధీభవన్ ముట్టడికి బయల్దేరారు.

పోలీసులు అడ్డుకున్నప్పటికీ.. ర్యాలీగా గాంధీభవన్ వద్దకు చేరుకుని కాంగ్రెస్ ఫ్లెక్సీలను చించేశారు. దీంతో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. చివరికి పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. దాంతో నాంపల్లిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇరు పార్టీల నేతలను అదుపులోకి తీసుకోవడంతో అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ దాడుల్లో బీజేపీ నేత స్టేట్ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నందరాజ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్​కు గాయాలయ్యాయి. ఇటు యూత్ కాంగ్రెస్ నేతలు కూడా గాయపడ్డారు. బీజేవైఎం లీడర్లపై బేగంబజార్ పోలీస్టేషన్ లో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయి ఫిర్యాదు చేశారు.

దాడిని ఖండించిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు
బీజేపీ ఆఫీస్​పై కాంగ్రెస్ దాడిని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రాకేశ్​రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా..? ఇంటిలిజెన్స్ పనిచేస్తుందా? అని ప్రశ్నించారు. ఈ దాడికి రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ బాధ్యత వహించాలన్నారు.

ఎవరిపై దాడి చేయలేదు: ఎంపీ అనిల్ యాదవ్
గాంధీ భవన్ పై బీజేపీ దాడిని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఖండించారు. బీజేపీ నేతలే కాంగ్రెస్ నేతలపై దాడి చేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు.  బీజేపీ లీడర్లే అబద్ధాలు చెప్తున్నరని మండిపడ్డారు. దాడులను కాంగ్రెస్ ప్రోత్సహించదన్నారు.

బీజేపీ క్షమాపణ చెప్పాలి: శివ చరణ్ రెడ్డి
ప్రియాంకపై అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ క్షమాపణలు చెప్పాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి డిమాండ్ చేశారు.లేకుంటే రాష్ట్రంలో కేంద్రమంత్రులను తిరగనివ్వబోమని హెచ్చరించారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విమర్శించారు.రమేశ్ బిధూరిని బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు.  బీజేపీ స్టేట్ ఆఫీస్ పై కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని కేంద్రమంత్రి బండి సంజయ్ హెచ్చరించారు.కాంగ్రెస్ ఆఫీసుల పునాదులు కూడా మిగలవన్నారు. తప్పుడు కామెంట్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలిగానీ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొవద్దని సూచించారు. 

దాడి చేయడం పిరికిపంద చర్య: బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి 
బీజేపీ స్టేట్ ఆఫీస్​పై కాంగ్రెస్ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ దాడులకు తాము సమాధానం చెప్తే.. దేశంలో ఒక్క కాంగ్రెస్ నేత కూడా రోడ్లపై తిరగలేడని హెచ్చరించారు. కానీ.. దాడులు చేయడం తమ సంస్కృతి కాదన్నారు. కాంగ్రెస్ లీడర్లు తమ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ‘‘బీజేపీ ఆఫీస్​పై రాళ్లు, కర్రలతో దాడి చేయడం పిరికిపంద చర్య. బీజేపీ ఆఫీస్​పై దాడి జరుగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు’’అని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

ఆఫీసులపై దాడి సరికాదు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
బీజేపీ ఆఫీస్​పై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. యూత్ కాంగ్రెస్ లీడర్ల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రియాంక గాంధీపై బీజేపీ లీడర్ కామెంట్లను ఖండించాల్సిందే. ఇదే టైమ్​లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇంకో రాజకీయ పార్టీ ఆఫీస్​పై దాడికి వెళ్లడం సరికాదు. బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ లీడర్లపై దాడి చేయాల్సింది కాదు. బీజేపీ నేతల తీరును ఖండిస్తున్నం. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ దాడులు సరికాదు’’ని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు.