చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత .. కాంగ్రెస్, బీఆర్ఎస్​ కార్యకర్తల మధ్య ఘర్షణ

వెల్దుర్తి, వెలుగు: మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లోని వివిధ గ్రామాలకు  చెందిన లబ్ధిదారులకు 79  చెక్కులు మంజూరు కాగా ఎంపీడీవో ఆఫీసులో ఎమ్మెల్యే సునీతా రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడొద్దంటూ మండిపడ్డారు. 

అక్కడే ఉన్న బీఆర్​ఎస్​నాయకులు స్పందిస్తూ మొదట ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి తోపులాట జరిగింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తోసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు పార్టీల నాయకులను పక్కకు తరలించారు. అనంతరం పోలీసుల భద్రత మధ్య చెక్కులు పంపిణీ  చేశారు.   

శివ్వంపేట: కల్యాణ లక్ష్మీ చెక్కులను కావాలని ఆపి ఇచ్చారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. శివ్వంపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 57 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ..అధికారులు ఏకపక్షంగా వ్యవహరించకూడదన్నారు.  ప్రభుత్వాలు ఏవైనా ఉంటాయి న్యాయం వైపు నడవాలని,  ప్రొటోకాల్ పాటించాలన్నారు.  కార్యక్రమంలో డీటీ షఫీవుద్దీన్. గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్ర గౌడ్, జిల్లా మాజీ జడ్పీ కో ఆప్షన్​మెంబర్ మన్సూర్ అలీ, కాంగ్రెస్​నాయకులు నవీన్ గుప్తా, సొసైటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్  పాల్గొన్నారు.

భగలాముఖి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే 

నవరాత్రుల సందర్భంగా శివ్వంపేట మండల కేంద్రంలోని భగలాముఖి అమ్మవారి శక్తి పీఠం ఆలయంలో శుక్రవారం ఆలయ వ్యవస్థాపకుడు వెంకటేశ్వర శర్మ, మాజీ జడ్పీటీసీ మహేశ్ గుప్తా ఆధ్వర్యంలో లక్ష పుష్పార్చన, హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి పల్లకీ సేవలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మాజీ ఎంపీపీ హరికృష్ణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణ గౌడ్,  గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్ర గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ 
పాల్గొన్నారు.