రంజిత్ రెడ్డి గెలుపు బాధ్యత మనదే: స్పీకర్ గడ్డం ప్రసాద్

వికారాబాద్, వెలుగు: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. చేవెళ్ల నుంచి గతంలో గెలిచిన జైపాల్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యారని, వికారాబాద్ కు శాటిలైట్ సిటీ వంటి అనేక అభివృద్ధి పనులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. శనివారం వికారాబాద్ సెగ్మెంట్ మర్పల్లిలోని ఫంక్షన్ హాల్లో పార్టీ  నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.

 కాంగ్రెస్ హయాంలోనే  వికారాబాద్ చాలా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్, కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ, మరోసారి ఆశీర్వదిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తానన్నారు. బీజేపీ రాముడి పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతుందని ఆరోపించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు కొండల్ రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, నేతలు సుభాష్ యాదవ్, కిషన్ నాయక్ పాల్గొన్నారు.