కామారెడ్డి జిల్లాలో అంతర్గత కుమ్ములాటలు.. ఆధిపత్య పోరు

  • కాంగ్రెస్​ పార్టీలో భగ్గుమన్న విభేదాలు
  • నామినేటెడ్​ పోస్టుల భర్తీపై రచ్చ​
  • అధిపత్యం కోసం కీచులాటలు

కామారెడ్డి, వెలుగు:  కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ ​శ్రేణుల్లో అంతర్గత కుమ్ములాటలు కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది.  రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేయాల్సిన ముఖ్యనేతలు జిల్లాలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహారిస్తున్నారు.  అందరిని కలుపుకొని పోవాల్సిన ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవ డంలేదని శ్రేణులు ఆందోళనకు దిగుతున్నారు.   నియోజకవర్గాల పంచాయతీ గాంధీ భవన్​కు చేరింది. పార్టీ, ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కూడా  ముఖ్య నేతలందరూ ఒకే వేదికపై కనిపించిన పరిస్థితి లేదు. 

ఇటీవల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ మినహా  పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.  సమగ్ర కుటుంబ సర్వేపై జిల్లా స్థాయిలో పార్టీ పక్షాన నిర్వహించిన మీటింగ్​కు  జుక్కల్ఎమ్మెల్యే హాజరుకాలేదు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ,  ఎమ్మెల్యేలు మదన్​మోహన్​రావు, పోచారం శ్రీనివాస్​రెడ్డి హాజరైనప్పటికీ వేదికపై ఎవరికి వారే అన్నట్లుగా కనిపించారు.   దిశ కమిటీ మీటింగ్​కు కాంగ్రెస్​ పార్టీకి చెందిన జహీరాబాద్​ఎంపీ హాజరుకాగా,  ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాలేదు.  మరో  నాలుగు నియోజక వర్గాల్లో పాత, కొత్త క్యాడర్​ మధ్య సఖ్యత కొరవడింది. 

ఎల్లారెడ్డిలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు

ఎల్లారెడ్డి నియోజక వర్గంలో ఎమ్మెల్యే కె.మదన్​మోహన్​రావు,  పార్టీ నేత వడ్డేపల్లి సుభాష్​రెడ్డి మధ్య  విబేధాలు భగ్గుమన్నాయి.  అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్​ కోసం ఇరువురు నేతలు పోటీపడ్డారు.  అధిష్టానం మదన్​మోహన్​రావుకు టికెట్​ఇవ్వడంతో సుభాష్​ రెడ్డి  బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేశారు.  ఎన్నికల్లో మదన్​మోహన్​రావు ఎమ్మెల్యేగా గెలిచారు.  కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతో సుభాష్​​రెడ్డి మళ్లీ సొంత గూటికి చేరారు.  పార్టీ శ్రేణులు కొందరు మదన్​మోహన్​రావు వెంట, మరి కొందరు సుభాష్​రెడ్డి వెంట ఉన్నారు.   

పార్టీ మండల ప్రెసిడెంట్లతో పాటు, నామినేటెడ్​ పోస్టుల భర్తీలో ఎమ్మెల్యే తన వర్గీయులకే ప్రాధాన్యం ఇస్తున్నారని సుభాష్​రెడ్డి వర్గీయుల వాదన.  సుభాష్​రెడ్డి  స్టేట్ కార్పొరేషన్​ పదవి కోసం ప్రయత్నిస్తుండగా, దీనికి ఎమ్మెల్యే అడ్డు పడుతున్నట్టు ఆరోపిస్తున్నారు.  ఇటీవల రామారెడ్డి మండలానికి చెందిన తన అనుచరుడిని ఎమ్మెల్యే వర్గీయులు దూషించారని పేర్కొంటూ సుభాష్​రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

ఎమ్మెల్యేపై ఘాటుగా విమర్శలు చేశారు. దీనిపై ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయడంతో సుభాష్​రెడ్డికి కమిటీ చైర్మన్ నోటీసు జారీ చేశారు.  మరుసటి రోజు పార్టీ సీనియర్​ సీనియర్​ నేతలు, కార్యకర్తలు  హైదరాబాద్​వెళ్లి ఎమ్మెల్యేపై పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్​కుమార్​గౌడ్​కు ఫిర్యాదు చేశారు.   పార్టీ కోసం కష్టపడ్డవారిని కాకుండా, కొత్తగా చేరిన వారికి ప్రయార్టీ ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. 

ALSO READ తెలంగాణలో వరంగల్​తో పాటు మరో మూడు ఎయిర్​పోర్టులు

గాంధీ భవన్​కు చేరిన జుక్కల్​ పంచాయతీ

జుక్కల్​ నియోజకవర్గ పంచాయతీ గాంధీ భవన్​కు చేరింది.  ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు, కొందరు ద్వితీయ శ్రేణి లీడర్ల మధ్య సఖ్యత లేదు. పార్టీ కోసం శ్రమించిన తమకు నామినేటెడ్​ పోస్టుల భర్తీ లో ప్రయార్టీ ఇవ్వడంలేదని పేర్కొంటూ ఇటీవల పలువురు నాయకులు గాంధీభవన్​కు వెళ్లి ధర్నా చేశారు.  నాయకుల మధ్య సఖ్యత కుదర్చాల్సిన బాధ్యత పీసీసీ ప్రెసిడెంట్  పై ఉంది. 

బాన్సువాడలో  ఇద్దరి మధ్య  పోరు

బాన్సువాడలో  ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి మధ్య పోరు కొనసాగుతోంది.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఏనుగు రవీందర్​రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.  బీఆర్ఎస్​ తరపున గెలిచిన పోచారం శ్రీనివాస్​రెడ్డి  కొన్నాళ్లకు కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు.  దీంతో ఇక్కడ రెండు వర్గాలుగా చీలిపోయారు.   కొందరు  పోచారం వెంట,  మరి కొందరు రవీందర్​రెడ్డి వెంట ఉన్నారు.  ఇరువురు ముఖ్య నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు.  మార్కెట్​ కమిటీ పాలకవర్గాల నియమాకం పోచారం తన అనుచరులకు ఇప్పించుకోవటంతో ఏనుగు రవీందర్​రెడ్డి వర్గానికి మింగుడుపడటంలేదు. ఇటీవల బీర్కుర్​లో రవీందర్​రెడ్డి వర్గీయులు ఆందోళన చేశారు.