ఇది మా బీసీ సర్కార్

  • పున్నా కైలాస్ నేత జనరల్ సెక్రటరీ, టీపీసీసీ 

‘మేమెంతో  మాకంత‘  ఇది మా  బడుగు, బలహీన వర్గాల నినాదం.  గత  పదేళ్లుగా  రాజ్యాంగ వ్యవస్థలపై  ముఖ్యంగా రిజర్వేషన్లపై  అప్రకటిత దాడులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం బీసీలపై  దమనకాండను చేస్తుంటే... దానికి గత బీఆర్ఎస్​ ప్రభుత్వం వంతపాడింది.  ఏవో  కంటితుడుపు చర్యలతో,  పైపై  పూతలతో  మమ్మల్ని  మభ్యపెట్టి   మా ఓట్లతో  రాజ్యాధికారం సాధించి మాపైనే  కక్షసాధింపు చర్యలకు దిగారు.  కేవలం బీసీ ప్రధానిగా మోదీ పేరుచెపుతూ... కులగణనను వ్యతిరేకిస్తూ,   కనీసం ఆయన మంత్రివర్గంలో  బీసీ మంత్రిత్వశాఖను కూడా ఏర్పాటు చేసుకోలేని  నిస్సహాయతలోకి  నెట్టారు.  

మెల్లమెల్లగా వారి నైజాన్ని బయటపెడుతూ ఏకంగా పార్లమెంటులోనే  రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్​ను  అవమానించే  దుస్సాహసానికి  ఒడిగట్టారు.  వడ్డించేవాడు  మనవాడైనా  వాడి గిన్నెలో  సరైన  ఆహారం లేదనే  కొత్త నానుడికి కారణమయ్యారు.  ఇక రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లకు పేరు గొప్పగా రూ. వేలకోట్లు.. పత్రాల్లో  చూపించి పదేళ్లలో  ఖర్చు చేసింది  కేవలం రూ. 911 కోట్లే.  అంటే,   బీసీలపై  వీరి చిత్తశుద్ధి  ఏపాటిదో  అర్థమవుతోంది.  అయితే,  ఇప్పుడిప్పుడే  మన రాష్ట్రంలో  బీసీ సాధికారత అనే  నినాదం చేతల్లో  అమలవుతూ.. మా 128 కులాల్లో  కొత్త ఆశల్ని  రేపుతున్నది.   దాదాపు రూ. పదివేల  కోట్లను  ఈ సంవత్సర బడ్జెట్లో  కేటాయించడమే కాకుండా  ఇప్పటికే సింహభాగం వాటిని బీసీల సంక్షేమానికి ఖర్చుచేసి చూపించింది  ప్రజా ప్రభుత్వం.

చరిత్రలో  కనీవినీ ఎరగని రీతిలో  సమగ్ర  కులగణన చేపట్టిన  రేవంతన్న  ప్రభుత్వం బీసీల  పక్షపాత  ప్రభుత్వమని ఆదిలోనే  నిరూపించింది.  ఆధిపత్య  భావజాలం  నిలువెల్లా  నింపుకుని  బీసీలకు  తనవల్ల  ఎలాంటి  లాభం లేదని  ప్రధాని మోదీ నిరూపిస్తే,  గుండెల నిండా బడుగు, బలహీన వర్గాలపై  ప్రేమను నింపుకొన్నాడు సీఎం రేవంత్ రెడ్డి.   తాను  పెరిగిన  ఆర్థిక,  సామాజిక  పరిస్థితుల్లో  దీనంగా,  హీనంగా  తల్లడిల్లుతున్న మా అవస్థలను కళ్లారా చూశాడు కాబట్టే  కులానికి వేరైనా... మా ఇంట్లో  బిడ్డయ్యాడు రేవంతన్న.  

సీఎం అయిన  తొలినాళ్లలోనే  సమర్థులైనవారితో  బీసీ కమిషన్  ఏర్పాటు చేయడమే కాకుండా,  బీసీల  స్థితిగతులపై  సమగ్ర అధ్యయనం చేయాలని చెప్పింది మన ప్రజా ప్రభుత్వం.  కులగణన కోసం  ప్రత్యేక  కమిషన్  వేయాలన్న హైకోర్టు  సూచనలపై  శషబిషలు లేకుండా తక్షణమే ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్​ ప్రభుత్వం.  రాష్ట్రంలో  జరుగుతున్న కులగణన నచ్చని త్రిశంకులు...  ఎన్యూమరేటర్లు లేరని,  ఉపాధ్యాయులు చేస్తే  బడిపిల్లల చదువులెట్లా  అన్న  సన్నాయి నొక్కులను సమర్థంగా అడ్డుకుని  రాష్ట్రం మొత్తం సంపూర్ణ కులగణన చేసింది​ సర్కారు.  

అంతేకాకుండా దాని డిజిటలైజేషన్  ప్రక్రియకు  చురుగ్గా  చర్యలు తీసుకుంటున్నారు.  తద్వారా  తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికల్లో  మా వాటా మాకు దక్కడమే  కాకుండా ఇకముందు ప్రభుత్వం తెచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమంలో,  భర్తీచేసే  ప్రతి ఉపాధిని మా బిడ్డలు  సగర్వంగా  అందుకొని  నిజమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని,  స్వావలంబనని పొందబోతున్నారు.  ఇదీ  బీసీ వర్గాలకు కావాల్సింది.  ఇది రేవంతన్న మాపై కురిపించే నిజమైన ప్రేమకు నిదర్శనం.

బీసీలకు అండగా కాంగ్రెస్​

ఇక యావత్ దేశంలో బీసీలపై  నిజమైన  ప్రేమను చూపించింది సైతం నాటి నుంచి నేటి వరకూ కాంగ్రెస్ పార్టీనే.  అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా బాబా సాహెబ్  అంబేద్కర్​ తెచ్చిన రాజ్యాంగంలోనే  బడుగు, బలహీన వర్గాలకు,  ఎస్సీ, ఎస్టీలకు  ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు.  తదనంతరం  కాలానుగుణంగా వస్తున్న మార్పులను  ఒడిసిపట్టి,  అమలుచేస్తున్న  కార్యక్రమాల  అనుభవాలను  క్రోడీకరిస్తూ  కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీ బిడ్డల మేలుకోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టాయి.  

మండల్  కమిషన్  సిపార్సుల  మేరకు విద్య, ఉపాధి  తదితర  రంగాల్లో  27శాతం  బీసీ  రిజర్వేషన్లు  తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ.  73,  74వ  రాజ్యాంగ సవరణ  ద్వారా  గ్రామ స్థాయిలో బీసీ స్వరాజ్య  భావనకు  బీజం వేసేలా  పంచాయతీ రాజ్  రిజర్వేషన్లు  ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.   విద్యారంగంలో  బీసీ  విద్యార్థులకు  స్కాలర్​షిప్​లు,  ప్రత్యేక హాస్టళ్లు,  నవోదయ,  కేంద్రీయ పాఠశాలలను కాంగ్రెస్​ ఏర్పాటు చేసింది.  

సకల బీసీ  కులాల ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్లు  ఏర్పాటు చేసింది.  ఆర్టికల్ 340 ద్వారా ప్రత్యేక కమిషన్లకు అవకాశం ఇచ్చింది.  77వ  రాజ్యాంగ సవరణ ద్వారా  ప్రమోషన్లలోనూ బీసీల వాటాను ప్రవేశపెట్టింది కాంగ్రెస్.  ఇలా చరిత్ర  పొడుగునా ఎన్నో అవకాశాల్ని కల్పిస్తూ ఇవ్వాళ సాధించిన  ప్రగతికి సాక్షిగా నిలిచింది కాంగ్రెస్. 

రేవంత్​ మోడల్​ను దేశవ్యాప్తంగా అమలుచేయాలి

ఇవే కాకుండా ఏకకాల రెండు లక్షల రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు,  ఫ్రీబస్సు వంటి ప్రతి ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకంలో  బీసీ  బిడ్డలుగా  మా న్యాయమైన వాటా  సాధించేవిధంగా  రేవంతన్న ప్రజా ప్రభుత్వం పథకాల్ని రూపొందిస్తోంది.  ఇదే కదా మేం ఆశించిన సమన్యాయం, ఇదే కదా మేం కోరుకున్న సామాజిక ప్రగతి.  కేవలం ఏడాది కాలంలోనే  మా బీసీల పట్ల ఇంత శ్రద్ధ చూపిస్తున్న రేవంతన్న ప్రజా ప్రభుత్వం ఇక రాబోయే రోజుల్లో చేసే సంక్షేమం, మాకందించే  సాధికారత ఖచ్చితంగా మా వర్గాలను స్వాభిమానంతో   బతికేలా  చేస్తుంది.  

అందుకే తెలంగాణలో రేవంత్​ మోడల్​ను  దేశం మొత్తం అమలు చేయాలి.  రాబోయే  జనగణనలో  కులగణన చేయాలని మనందరం కేంద్రాన్ని నిలదీద్దాం.  వెనుకబడిన వర్గాల అంశాల్లో  రాజకీయాలు పక్కన పెట్టి  రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని బీజేపీ, బీఆర్ఎస్ అభినందించాలి. మాకోసం  దేశ స్థాయిలోనూ  కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కలిసిరావాలి.  బీసీ బిడ్డలుగా  లోకల్ బాడీల్లో  42శాతం రిజర్వేషన్లు అందించాలన్న రేవంతన్న సర్కారుకు అండగా నిలుద్దాం.

బీసీల సంక్షేమానికి ఏడాదిలో రూ.2,371 కోట్లు

ఒక బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ నుంచి కొత్తగా ముదిరాజ్, యాదవ కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేర, గంగపుత్ర వంటి మరో ఎనిమిది బీసీ కార్పొరేషన్లను,  గతంలో  ఫెడరేషన్లుగా ఉన్న మరో  ఎనిమిదింటిని కార్పొరేషన్లుగా  రేవంత్​ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  ఇలా  కార్పొరేషన్లు,  ఫెడరేషన్లు  అన్నింటికీ కలిపి రూ.2,371 కోట్లు కేవలం ఒక్క సంవత్సరమే కేటాయించి ఖర్చు చేస్తోంది రేవంతన్న ప్రజా ప్రభుత్వం.  వీటితో పాటు  మా నేత కార్మికుల సంక్షేమం కోసం రూ.400 కోట్ల  పాత బకాయిలు విడుదల చేయడమే కాకుండా, సిరిసిల్ల వంటి సంక్షుభిత ప్రాంతాల్లో యార్న్ డిపో,  నూలుపై సబ్సిడీ అందించింది.  

ప్రభుత్వానికి వస్త్రాన్ని అందించేలా గతంలో అందించిన సంక్షేమాన్ని తిరిగి తీసుకొచ్చింది.  గీత కార్మికుల ప్రాణాలు కాపాడే దిశగా కాటమయ్య రక్ష పథకాన్ని ప్రారంభించింది.   బీసీ,  ఎస్సీ,  ఎస్టీ  సంక్షేమ హాస్టళ్లు,  గురుకులాల్లో చదువుతున్న మా బిడ్డల కోసం పదేళ్ల తర్వాత  ఏకంగా 40శాతంపైగా  డైట్,  కాస్మొటిక్ చార్జీల్ని పెంచింది.  మా బిడ్డలకు నాణ్యమైన భోజనాన్ని అందించి కడుపు నింపుతోంది రేవంతన్న సర్కార్.

-  పున్నా కైలాస్ నేత జనరల్ సెక్రటరీ, టీపీసీసీ -