ఈ పరిస్థితిని అధిగమిస్తాం

 ఈ పరిస్థితిని అధిగమిస్తాం
  • రూపాయి విలువపై టెన్షన్​ వద్దు
  • ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్

న్యూఢిల్లీ: ఫారెక్స్ రిజర్వ్ తగ్గుదలపై ఆందోళనలను ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ మంగళవారం తోసిపుచ్చారు. ప్రస్తుతం కొన్ని ఆటుపోట్లు ఉన్నప్పటికీ,  మనదేశం దగ్గర భారీగా ఫారెక్స్​ రిజర్వ్‌‌లు ఉన్నాయని అన్నారు.  విదేశీ మారకద్రవ్య నిల్వలు వరసగా ఏడో వారమూ తగ్గి ఈనెల 16న  545.65 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ప్రపంచ మార్కెట్లలో సమస్యల కారణంగా రూపాయిని రక్షించుకోవడానికి సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న చర్యల వల్ల నిల్వలు తగ్గాయి. మునుపటి వారంలో  ఫారెక్స్​ రిజర్వుల విలువ 2.23 బిలియన్ డాలర్లు తగ్గి  550.87 బిలియన్ డాలర్లుగా రికార్డయింది.  ఇన్​ఫ్లోలు తగ్గడం,  వాణిజ్య లోటు ఎక్కువగా ఉన్నందున నిల్వలు కాస్త తగ్గాయని, దీనిపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని సేథ్​ అన్నారు. ఈ పరిస్థితిని అధిగమిస్తామని వివరించారు. 

డాలర్‌‌తో పోలిస్తే రూపాయి సోమవారం  81.67 వద్ద రికార్డు స్థాయికి చేరింది. ఇది మంగళవారం కోలుకుని  81.58 వద్ద ముగిసింది. ఇదే విషయమై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మాట్లాడుతూ  మన ఆర్థిక వ్యవస్థ పునాదుల బలం వల్ల రూపాయి బాగానే ఉందన్నారు.  డాలర్‌‌తో పోలిస్తే ఇతర కరెన్సీల పతనం చాలా ఎక్కువని వివరించారు.    ఈ ఏడాది సెప్టెంబరు 3తో ముగిసిన వారంలో భారతదేశ ఫారెక్స్ రిజర్వ్  642.453 బిలియన్ డాలర్లకు చేరుకుంది. యూఎస్​ ఫెడ్​ పోయిన వారం వడ్డీరేటును 75 బేసిస్ పాయింట్లు పెంచింది. తదనంతరం ప్రపంచవ్యాప్తంగా కరెన్సీలు ఒడిదుడుకులకు గురయ్యాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు 6.4 శాతం టార్గెట్​కు కట్టుబడి ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నది.