భారతీయ సమాజం..సంస్కృతి గొప్పదనం

భారతీయ సమాజంలోని వివిధ రంగాల్లో ఐక్యత అనేది అంతర్లీనంగా ఉంది. సుదీర్ఘమైన సాంస్కృతిక చరిత్ర, జీవితం పట్ల ఒక నిర్దిష్టమైన ఆలోచనా వైఖరి, తాత్విక ఆలోచనా విధానం అనే వాటి మూలంగా భారతీయ సమాజం ఒక నూతన సంస్కృతిని సృష్టించగలిగింది. 

అదే భారతీయ సంస్కృతి. ఇది అందరికీ ఆమోదయోగ్యమైన, ఉన్నతమైన సంస్కృతి. ఈ సంస్కృతే వివిధ జాతులకు, మతాలకు, భాషలకు, కులాలకు, సంస్కృతులకు చెందిన ప్రజలను ఐకమత్యంగా ఉండేటట్లు చేసింది.

 అంటే జాతి, భాష, మత సంస్కృతులపరంగా ఇన్ని  వైవిధ్యతలున్నా భారతీయ సంస్కృతి అనే భావన అందరినీ ఐక్యం చేసి ఒక్క తాటిపై నడిచేటట్లు చేస్తోంది. అదే భారతీయ సంస్కృతి గొప్పదనం.

భౌగోళికపరమైన వైవిధ్యత

భారతదేశం ఏకతకు చిహ్నం. ఇండియా​కు ఉత్తరాన హిమాలయాలు, ఇత్తర ఎత్తయిన పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం సరిహద్దులుగా ఉన్నాయి. ప్రధాన భూభాగం ఎత్తయిన పర్వతాలతో, విశాలమైన మైదాన ప్రాంతాలతో, ఎడారులతో, ద్వీపకల్పాలతో కూడుకుని ఉంది. 

భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ప్రధానమైన దేశం అన్ని రకాల పంటలను పండించడానికి అనువైన భూమి భారతదేశంలో ఉంది. ప్రకృతి సహజమైన ఆహార పదార్థాలను సమకూర్చగలిగిన దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాలు ఉన్నాయి.

 నదులు, సముద్ర తీర ప్రాంతాలతో వ్యాపార వాణిజ్య కార్యక్రమాలకు, నౌకాయానానికి ఉపయోగపడే నౌకాశ్రయాలు కూడా ఉన్నాయి. భౌగోళిక భారతదేశం సుసంపన్నమైన దేశం.

గ్రామీణ జీవన విధానం

2011 జనాభా లెక్కల ప్రకారం 67.5శాతం భారత జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నది. ఇందులో అత్యధికులు వ్యవసాయం, చేతివృత్తులు, గ్రామీణ కుటీర పరిశ్రమలపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయమే ప్రజల ప్రధాన వృత్తి.  

గ్రామీణ జీవన విధానమనేది పరస్పర సాన్నిహిత్యం, ముఖాముఖి సంబంధాలు కలిగిన జీవనం. గ్రామీణ జీవితంలో బంధుత్వ సంబంధాలు అత్యంత ప్రాధాన్యాన్ని కలిగి ఉండి, అవి వారి జీవన విధానంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.

సమష్టి కుటుంబం 

మూడు లేదా నాలుగు తరాలకు చెందిన ప్రజలు  ఒకే నివాస గృహంలో నివసిస్తూ ఒకేచోట వండిన ఆహారాన్ని తింటూ ఆస్తి విభజన లేకుండా ఉమ్మడి వ్యవస్థను కలిగి ఉండి, ఆర్థిక, మతపరమైన కార్యక్రమాల్లో ఉమ్మడిగా కలిసి పాల్గొంటూ ఒకరికొకరు పరస్పరం సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండి, పరస్పర హక్కులను, విధులను కలిగి ఉన్న సమూహాన్ని సమష్టి కుటుంబంగా నిర్వచించవచ్చు.

 హిందూ సామాజిక వ్యవస్థలో సమష్టి కుటుంబమనేది అత్యంత ప్రధానమైంది. సమష్టి కుటుంబం అనేది భారతీయ సమాజ ప్రత్యేక లక్షణం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమష్టి కుటుంబ వ్యవస్థ అనేది ప్రబలంగా ఉండేది. గత కొన్ని సంవత్సరాలుగా పారిశ్రామికీకరణ, ఆధునికీకరణల ప్రభావంతో సమష్టి కుటుంబ వ్యవస్థ విఘటితమవుతోంది. అయినా నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమష్టి కుటుంబ వ్యవస్థను చూడవచ్చు. 

కుల వ్యవస్థ

భారతీయ సమాజంలో కుల వ్యవస్థ అనేది అనాదిగా ఉంది. కులవ్యవస్థ అనేది భారత సమాజ ప్రత్యేక లక్షణం. భారతీయ తాత్విక విచారణపై, భారతీయ సమాజంపై కుల వ్యవస్థ ప్రభావం ఎంతో ఉంది. కులవ్యవస్థ లక్షణాలను సంక్షిప్తంగా ఈ విధంగా చెప్పవచ్చు. 

జన్మత: సంప్రాప్తించే అంతస్తు, కుల క్రమానుగతశ్రేణి, అంతర్వివాహం, నిర్దిష్టమైన వృత్తి, ఆహారపానీయాలపై విధి నిషేధాలు, సామాజిక పరస్పర సంబంధాలపై విధి నిషేధాలు, ఆచారాలు, సంప్రదాయాలు, వేషభాషల్లో వ్యత్యాసాలు, పరిశుద్ధత, అపరిశుద్ధత, కొన్ని ఉన్నత కులాలకు ప్రత్యేక అర్హతలు,  మరికొన్ని నిమ్నకులాలకు అనర్హతలు, కుల పంచాయతీలు మొదలైనవి. కుల వ్యవస్థ ఒక పరాధీకృత వ్యవస్థ. 

హిందూ మతానికి చెందిన ఏ వ్యక్తి కూడా ఈ కులవ్యవస్థ అనే బంధాల నుంచి తప్పించుకోలేడు. కుల వ్యవస్థకు సంబంధించిన నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ ఎలాంటి వ్యతిరేకత లేకుండా అంగీకరిస్తారు.  

జాతిపరమైన విభాగాలు

జాతి అనేది ఒక జైవిక సమూహం. ఒకే రకమైన శారీరక లక్షణాలున్న సమూహాన్ని జాతి అంటారు. మానవుల్లో కొన్ని ఉమ్మడి శారీరక వారసత్వ లక్షణాలున్న వారు ఒక విభాగం కిందికి వస్తారు. శారీరక లక్షణాల్లో వీరు మరో విభాగం వారితో వేరవుతుంటారు. మానవుల్లో కొన్ని శారీరక లక్షణాలను జాతి నిర్ణయకాలుగా నిర్ధారించారు.

 మానవుల వెంట్రుకలు, శరీర స్థాయి, తల రూపము, ముఖ లక్షణాలు, చర్మపురంగు, చేతులు, కాళ్ల పొడవు, రక్త సమూహ రకాలు మొదలైన వాటిని జాతి నిర్ణయకాలుగా చెప్పారు. భారతదేశ జనాభా బహు జాతుల సమ్మేళనం. 

భారతదేశ జనాభాలో వివిధ రకాల జాతుల వారున్నారు. బిఎస్​ గుహ ప్రకారం భారతదేశ జనాభా ఆరు రకాల జాతి సమూహాలతో కూడుకుని ఉంది. అవి నీగ్రిటో, ప్రోటో ఆస్ట్రలాయిడ్​, మంగోలాయిడ్​, మెడిటెర్రేనియన్​ లేదా ద్రవిడియన్లు, బ్రాఖి సెఫాల్స్​, నార్డిక్​ ఆర్యన్లు. 

భాషాపరమైన విభాగాలు 

భారత రాజ్యాంగం ప్రకారం అధికారికంగా గుర్తించిన భాషలు 18. అయితే, దేశంలో 1652 భాషలను మాట్లాడుతారు. ఈ భాషలన్నింటిని ఐదు భాషా సమూహాలుగా వర్గీకరించవచ్చు. ఆస్ట్రిక్​, ఇండో ఆర్యన్​, ద్రవిడియన్​, టిబెటన్​, యూరోపియన్​, హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీయ, ఒరియా, పంజాబి, బిహారీ, రాజస్తానీ, అస్సామీ, సంస్కృతం, సింధీ, కశ్మీరీ, మొదలైన భాషలన్నీ ఇండో ఆర్యన్​ భాషా సమూహం కిందికి వస్తాయి. 

దేశంలోని 75శాతం జనాభా ఇండో ఆర్యన్​ సమూహానికి చెందిన భాషలను మాట్లాడుతారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మొదలైన భాషలు ద్రవిడియన్​ భాషా సమూహం కిందికి వస్తాయి. ఇంగ్లిష్​, పోర్చుగీసు, ఫ్రెంచ్​ మొదలైన భాషలు యూరోపియన్​ భాషా సమూహం కిందికి వస్తాయి. ఈ రకంగా భారతదేశ జనాభా బహుభాషల సమ్మేళనమని చెప్పవచ్చు. 

మతపరమైన విభాగాలు 

భారతదేశంలో చాలా మతాలున్నాయి. వాటిలో ప్రధానమైనవి హిందూ మతం, ఇస్లాం, క్రైస్తవం, సిక్కు, బౌద్ధ, జైన, జోరాష్ట్రియన్​ మతాలు ఉన్నాయి. అయితే అత్యధిక ప్రజలు హిందూ మతానికి చెందినవారు. చాలా మంది తాత్విక వేత్తలు హిందూ మతాన్ని ఒక జీవన విధానంగా వర్ణించారు. హిందూ మతం వివిధ సంస్కృతుల సమ్మిళితం. 

అది ప్రధానంగా రుషుల, తాత్వికవేత్తల ఆలోచనా విధానాల మీద ఆధారపడి ఏర్పడిన మతం. అన్ని మతాలకు కొన్ని మత విశ్వాసాలుంటాయి. అయితే అవి ఒకదానికొకటి విభిన్నంగా ఉండవచ్చు. 

ఆయా మతాల మత విశ్వాసాలు విభిన్నమైనా వాటన్నింటిలోను భగవంతుడొక్కడే, కంటికి కనిపించని భగవంతునిలో విశ్వాసం, వ్యక్తి ఆలోచనా విధానంలో పరిశుద్ధత, దయ అనే సాధారణ భావాలు గోచరిస్తాయి. 

సాంస్కృతికపరమైన 

భారతదేశంలో చాలా రకాల సంస్కృతులు విస్తరించి ఉన్నాయి. భారతీయ సమాజం బహు సంస్కృతులతో కూడుకొని ఉన్న సమాజం. విభిన్న మతాలకు చెందిన ప్రజలు వివిధ రకాల ఆచారాలను, సాంప్రదాయాలను అనుసరిస్తారు. 

అయితే విభిన్న మతాలకు చెందిన ప్రజలు విభిన్న రకాలైన ఆచారాలను, సాంప్రదాయలను పాటిస్తున్నా భారతీయ ప్రజల్లో సాంస్కృతిక ఏకత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు విభిన్న మతాలకు, సమూహాలకు చెందిన వారైనా వారిలో తామంతా భారతీయులమనే భావన ప్రబలంగా ఉంది. ఈ భావన మూలంగానే భారతీయ ప్రజల్లో ఏకత అనేది ఏర్పడటానికి ఆస్కారమేర్పడింది. 

మతపరంగానే కాకుండా ప్రాంతీయ పరంగా కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన సంస్కృతి మనకు కనిపిస్తుంది. ప్రాంతాల వారీగా ప్రత్యేక సంస్కృతి మనకు కనిపిస్తున్నా భారతీయ ప్రజల్లో ఒక సాధారణ సంస్కృతి అనేది గోచరిస్తుంది. అదే భారతీయ సంస్కృతి. ఈ భారతీయ సంస్కృతి దేశం మొత్తం ప్రజల్లో ఐక్యత ఏర్పడేటట్లు చేస్తుంది. 

భిన్నత్వంలో ఏకత్వం 

భారతీయ సమాజంలో విభిన్న జాతులు, మతాలు, భాషలు, కులాలు, సంస్కృతులకు చెందిన ప్రజలున్నారు. దేశ భౌగోళిక పరిస్థితుల్లోను, సామాజిక, రాజకీయ జీవన విధానాల్లోనూ వైవిధ్యతలున్నాయి. ఈ వైవిధ్యతలతోపాటు భారతీయ సమాజంలో ఏకతకు దోహదపడే శక్తులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మన దేశంలో జాతీయ జెండా, జాతీయ గీతము, జాతీయ భాష అనేవి ఉన్నాయి.

 ఇవన్నీ భారతీయ ప్రజల్లో ఇది మన దేశం, మన ప్రాంతం, తామంతా ఒక్కటే అనే భావన స్ఫురింపజే స్తాయి. ఈ భావనల మూలంగా దేశ ప్రజల్లో ఎన్ని వైవిధ్యతలున్నప్పటికీ ఐక్యత భావమ నేది ఏర్పడుతుంది. తద్వారా భారతదేశం ఒక బలీయమైన జాతిగా ఆవిర్భవించింది. అంతేగాకుండా ఒకే ప్రణాళిక, ఒకే చట్టం, ఒకే ప్రభుత్వం అనేవి కూడా విభిన్న సమూ హాల మధ్య ఏర్పడటానికి దోహదపడింది. 

ఈ రకంగా విభిన్న కారకాలు భారతీయ ప్రజల్లో ఐక్యత ఏర్పడటానికి, జాతీయ ఏకతకు దోహదపడ్డాయి.