మెదక్​ జిల్లాలో కుటుంబ సర్వే షురూ..  ఇళ్లకు స్టిక్కర్లు

  • మెదక్​ జిల్లాలో మొదటి రోజు సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం 
  •  టేక్మాల్​ మండలంలో కలెక్టర్​, చిలప్​చెడ్​ మండలంలో జడ్పీ సీఈఓ పర్యవేక్షణ
  • ఇళ్లకు తాళాలు ఉండటంతో ఇబ్బందులు పడ్డ ఎన్యుమరేటర్లు 

మెదక్, నిజాంపేట, చిలప్​చెడ్​, వెలుగు: మెదక్ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది.  తొలిరోజు ఎన్యుమరేటర్లు  కుటుంబాలను గుర్తించేందుకు ఇళ్లకు స్టిక్కర్లు అతికించారు.  కలెక్టర్​ రాహుల్​రాజ్​ టేక్మాల్​ మండలంలోని కోరంపల్లిలో సర్వే ను పర్యవేక్షించారు.  స్వయంగా పలు ఇళ్లకు స్టిక్కర్లు అతికించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   సర్వేలో ప్రభుత్వం పొందుపరిచిన సుమారు 75 కాలమ్స్‌‌లలో సామాజిక ,ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ తదితర వివరాలు సేకరిస్తారన్నారు.

 జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు సమగ్ర సర్వే విషయంపై విస్తృతంగా ప్రచారం చేయించాలన్నారు.  సర్వేకు  వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలని ‌‌కోరారు. సర్వే  ద్వారా సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచుతారన్నారు.   తప్పుడు సమాచారం ఇవ్వకుండా సరైన సమాచారాన్ని ఇస్తే భవిష్యత్తులో సంక్షేమ పథకాలకు ఉపయోగ పడుతుందని తెలిపారు .

ఇళ్లకు తాళాలతో ఇబ్బందులు 

నిజాంపేట మండలంలో సమగ్ర సర్వే లో భాగంగా ప్రైమరీ స్కూల్ టీచర్లు ఒంటి గంట తర్వాత గ్రామాల్లో  సర్వే కు బయలుదేరారు. సర్వేకు వచ్చిన ఎన్యుమేటర్ల కు చాలా ఇళ్లకు తాళాలు ఉండటంతో ఇబ్బందులకు గురయ్యారు. తాళాలు వేసిన ఇంటికి స్టిక్కర్ ఎలా వేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. కొందరు పక్కన ఉన్న వారిని అడిగి ఇంటి యజమాని పేరు తెలుసుకుని సర్వే స్టిక్కర్స్ వేశారు.

 వరి పంట  చేతికి రావడంతో చాలామంది కోతలు కోసేందుకు పొలాలకు వెళ్లడం, ఇండ్లకు తాళాలు వేసి వడ్లను ఆరబోయడానికి కల్లాల దగ్గరకు వెళ్లడంతో టీచర్లు కొంత ఇబ్బంది పడ్డారు. గ్రామంలో ఏ ఇళ్లు, ఏ వార్డు కిందికి వస్తుందో కూడా తెలియక ఎన్యుమేటర్లు ఇబ్బందులు పడ్డారు. సర్వే ముగిసే వరకు ప్రతి ఇంటి దగ్గర ఎవరైనా ఒకరు ఉండేలా గ్రామస్థులకు అధికారులు అవగాహన కల్పించాలని టీచర్లు కోరుతున్నారు.

ప్రణాళికబద్ధంగా ఇంటింటి సర్వే: జడ్పీ సీఈఓ ఎల్లయ్య 

ప్రణాళికబద్ధంగా ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించాలని జడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు.  బుధవారం చిలప్​చెడ్​ మండలం చిట్కుల్‌‌లో సర్వే ఏర్పాట్లను పరిశీలించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ..  మండలం మొత్తం 19 గ్రామ పంచాయతీలో 6,234 ఇండ్లు ఉన్నాయని, 50 బ్లాక్ లు, 50 మంది ఎన్యుమరేటర్లు, 5 మంది సూపర్‌‌ వైజర్లను నియమించామని ఆయన అన్నారు. సర్వేకు వచ్చే అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆనంద్, ఎంపీఓ శరత్ కుమార్ రెడ్డి, ఏపీవో, సూపర్‌‌వైజర్ శ్యామ్, పంచాయతీ సెక్రెటరీ తిరుపతి పాల్గొన్నారు.