పోడు భూములు సాగు చేసుకుంటే దౌర్జన్యం

  • పోలీసుల ముందే దాడి చేసినా, గాయాలైనా పట్టించుకోలేదు
  • ఎస్పీకి టేక్మాల్​ మండలం షాబాద్​తండా గిరిజనుల ఫిర్యాదు 

మెదక్, వెలుగు: పోడు భూములు సాగు చేసుకుంటుంటే కొందరు దౌర్జన్యం చేశారని, పోలీసుల ముందే తమపై దాడి చేసినా పట్టించుకోలేదని మెదక్​జిల్లా టేక్మాల్ మండలం షాబాద్ తండా గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం బాధిత గిరిజనులు ఎస్పీ ఉదయ్​ కుమార్ రెడ్డి ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. తండా పరిధిలోని సర్వే నెంబర్ 86లో  దాదాపు 360 ఎకరాల అటవీ భూమి ఉండగా, అందులో150 ఎకరాల భూమికి పట్టాలు వచ్చాయన్నారు.

మిగతా భూమిని భూమి లేని గిరిజనులు పోడు వ్యవసాయం కింద సాగు చేసుకుంటున్నారని తెలిపారు. అందరిలాగే తాము కూడా దాదాపు 50 ఏళ్లుగా అదే సర్వే నంబర్ భూమిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని వివరించారు. ఈ క్రమంలో ప్రకాశ్, దినేశ్, సేవాలాల్ తో పాటు కొందరు తాము సాగులో ఉన్న భూమిలో అక్రమంగా హద్దులను చెరిపేయగా అడ్డుకున్నామన్నారు.

ఈ విషయమై తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా తమపైనే కేసు నమోదు చేశారని ఆరోపించారు. తమ భర్తలను జైలుకు పంపించగా, వారు ఇంకా జైలులోనే ఉన్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అదునుగా భావించిన సదరు వ్యక్తులు సోమవారం తమ భూమిలోకి వచ్చి పొలం గట్టును దున్నుతుండగా "ఈ భూమి మాది మేము సాగుచేస్తున్నామని, పెద్ద మనుషులు చెప్పిన విధంగానే హద్దులు పెట్టి సాగుచేసుకుంటే ఇలా చేయడం ఏంటని " ప్రశ్నించగా తమపై గొడ్డళ్లు, కట్టెలతో దాడి చేసి చంపే ప్రయత్నం  చేశారని ఆరోపించారు.  

మహిళలు అని కూడా చూడకుండా బూతులు తిడుతూ విచక్షణారహితంగా కొట్టారన్నారు. ఈ విషయాన్ని తాము పోలీసులకు తెలపగా వారు సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ సరిగా స్పందించలేదన్నారు. పోలీసుల సమక్షంలోనే గొడ్డలితో నరకగా రమావత్ బుజ్జి తలకు గాయమైందని,  రమావత్ యమునకు పక్కటెముకలకు దెబ్బ తగిలిందని, ప్రమీలకు కాలు విరిగిందని తెలిపారు.

ఇంత జరుగుతున్నా పోలీసులు చూస్తూ నిలబడ్డారు కానీ వాళ్లను ఆపే ప్రయత్నం చేయలేదన్నారు. కాగా షాబాద్ తండా గిరిజనులపై దౌర్జన్యానికి దిగింది, దాడిచేసి గాయపరచింది కాంగ్రెస్​ నాయకుడని ఆందోల్​ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్​ ఆరోపించారు. మెదక్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మంత్రి అండతోనే కాంగ్రెస్​ నాయకులు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. షాబాద్ తండా గిరిజనులకు జరిగిన అన్యాయం, పోలీసుల తీరుపై ఎస్పీకి ఫిర్యాదు చేశామని చెప్పారు.  ​