యాదగిరిగుట్టపై రీల్స్‌ చేసిన కౌశిక్‌రెడ్డిపై చర్య తీసుకోవాలి

  • పటాన్‌చెరు పీఎస్‌లో ఫిర్యాదు

సంగారెడ్డి, వెలుగు : యాదగిరిగుట్టపై రీల్స్‌ చేసిన హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విశ్వ హిందు పరిషత్‌ ధర్మ ప్రచార్‌ రాష్ట్ర కో-కన్వీనర్‌ మధురనేని సుభాశ్‌ చందర్‌ కోరారు. ఈ మేరకు సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద రీల్స్‌ చేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అన్నారు.

ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి ఆలయంలో రీల్స్‌ చేసి సోషల్‌  మీడియాలో పెట్టడం సరికాదన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని, లేకపోతే విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌ దళ్‌ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డితో పాటు, యాదగిరిగుట్ట ఆలయ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని సుభాశ్‌ చందర్‌ కోరారు.