ఐలోని పదవుల కోసం పోటీ !..చైర్మన్​ పదవి కోసం ఆశావహుల ఆరాటం

  • పాత, కొత్త నేతల మధ్య తీవ్ర పోటీ
  • ట్రస్ట్​ బోర్డుపై కేసు పెండింగ్ తో గందరగోళం
  • వచ్చే నెల 13న ప్రారంభంకానున్న మల్లన్న జాతర 

హనుమకొండ, వెలుగు: ప్రముఖ శైవ క్షేత్రమైన ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలకు సమయం దగ్గర పడుతోంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడంలో కీలకమైన ఆలయ ట్రస్ట్​బోర్డు విషయంలో ఇంతవరకూ క్లారిటీ లేదు. గతేడాది నియమించిన ట్రస్ట్​బోర్డుపై హైకోర్టులో కేసు నడుస్తుండగా, ఇప్పుడు జాతర సమీపిస్తున్న నేపథ్యంలో కొత్త కమిటీ ఏర్పాటుపై స్పష్టత కరువయ్యింది.

మరోవైపు కొందరు నేతలు ఐనవోలు మల్లన్న ఆలయ పాలకవర్గంలో పదవుల కోసం పోటీ పడుతున్నారు. చైర్మన్​గిరి కోసం కొందరు ఆరాట పడుతుంటే, డైరెక్టర్​పదవుల కోసం మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇద్దరు కీలక నేతలు తమ అనుచరులకు పదవులు ఇచ్చుకునేందుకు కసరత్తు చేస్తుండటంతో ట్రస్ట్​బోర్డు విషయంలో గందరగోళం నెలకొంది.

ట్రస్ట్ బోర్డుపై సందిగ్ధం..

ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 13వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఉత్సవాలు కొనసాగనుండగా, మకర సంక్రాంతి సమయంలోనే ఏటా 10 లక్షలకు పైగా భక్తులు వస్తుంటారు. ఈ మేరకు ఆలయంలో ఏర్పాట్లతోపాటు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టడంలో ఆఫీసర్లతోపాటు ట్రస్ట్​బోర్డు పాత్ర కీలకం.

కానీ ఐలోని మల్లన్న ఆలయ పాలకవర్గం ఏర్పాటుకు ఏటా ఇబ్బందులే తలెత్తుతున్నాయి. ప్రతిసారి తాత్కాలిక కమిటీలతో జాతర నిర్వహించాల్సి వస్తోంది. 2023 జనవరి 10న అప్పటి ఎమ్మెల్యే అరూరి రమేశ్​ సిఫారసు మేరకు ఒంటిమామిడిపల్లికి చెందిన బీఆర్ఎస్​నేత మజ్జిగ జయపాల్ ను చైర్మన్​గా, మొత్తం 14 మందితో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేశారు. ఆలయంలో వాటాదారుడైన జయపాల్​ను ట్రస్ట్​మెంబర్​గా నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ట్రస్ట్​బోర్డు నియామకం చెల్లదంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

ఫలితంగా ఆ జాతరతోపాటు నిరుడు కూడా కమిటీ లేకుండానే బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఇప్పటికీ ఆ వివాదం అలాగే కొనసాగుతుండగా, ఈ ఏడాది ఆగస్టులో ఎండోమెంట్​ఆఫీసర్లు కొత్త ట్రస్ట్​బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్​ విడుదల చేశారు. ఔత్సాహికులు కొందరు దరఖాస్తు చేసుకోగా, కోర్టు తీర్పు పెండింగ్​నేపథ్యంలో ఆ ప్రక్రియకూ బ్రేకులు పడ్డాయి.  

పాత, కొత్త నేతల మధ్య పోటీ..!

ఆలయ పాలకవర్గ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసి, ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలి. ఆ తర్వాత రూల్స్​ ప్రకారం అర్హులను గుర్తించి, ఎండోమెంట్​కమిషనర్ ​ద్వారా ట్రస్ట్​బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ స్థానిక నేతల సిఫారసుల మేరకే ట్రస్ట్ బోర్డు ఎంపిక ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే కేఆర్ ​నాగరాజుతోపాటు స్థానికుడైన టెస్కాబ్​ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ఆలయ పాలకవర్గ సభ్యుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ఐనవోలు ఆలయ ట్రస్ట్​బోర్డు విషయంలో కాంగ్రెస్​ పార్టీ పాత, కొత్త నేతల మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఐనవోలు మండలానికి చెందిన కాంగ్రెస్​సీనియర్​నేత చైర్మన్​పదవిని ఆశిస్తుండగా, అదే సీటు కోసం ఎన్నికల నేపథ్యంలో హస్తం పార్టీలో చేరిన మరికొందరు కూడా ఆశిస్తున్నారు. పాత వాళ్లకు కాకుండా కొత్త వాళ్లకు అవకాశం ఇస్తే ఊరుకోబోమని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. దీంతో లీడర్లకు కూడా ట్రస్ట్ బోర్డు సభ్యుల ఎంపిక సవాల్​గా మారినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 13 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, ట్రస్ట్​బోర్డు ఏర్పాటుపై క్లారిటీ వస్తుందో లేదో చూడాలి.