పరిహారం రూ.13 లక్షలేనా

  • మంచిర్యాల శివారులో ఇండస్ట్రియల్​ హబ్ ​ఏర్పాటుకు అడుగులు
  • వేంపల్లి, ముల్కల్ల, పోచంపాడ్​ గ్రామాల్లో 295 ఎకరాల భూసేకరణ
  • నోటిఫికేషన్ ​ఇవ్వకుండానే రైతుల సంతకాలు తీసుకుంటున్న వైనం
  • బలవంతంగా సంతకాలు సేకరిస్తున్న ఇద్దరు కాంగ్రెస్ నాయకులు 
  • అధికారులు చేయాల్సిన పనులు లీడర్లు చేయడంపై విమర్శలు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల శివారులో ఇండస్ట్రియల్​హబ్, ఐటీ పార్క్ ఏర్పాటు కోసం సేకరిస్తున్న భూములకు ఎకరానికి రూ.13 లక్షల పరిహారం ప్రకటించారు. 180 గజాల ప్లాట్, ఇందిరమ్మ ఇంటితో పాటు కుటుంబంలో ఒకరికి జాబ్ కల్పిస్తామన్నారు. అయితే జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ అసైన్డ్​భూములంటూ పరిహారం తక్కువగా నిర్ణయించారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఈ ప్రాంతంలో పట్టా భూములకు మార్కెట్​రేటు ఎకరానికి రూ.50 లక్షల పైనే పలుకుతోంది. దీంతో పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

295 ఎకరాలు సేకరణ 

ఇండస్ట్రియల్ హబ్, ఐటీ పార్క్​ఏర్పాటు కోసం హాజీపూర్ మండలంలోని వేంపల్లి, ముల్కల్ల, పోచంపాడ్​ గ్రామాల శివార్లలోని 295 ఎకరాల భూములను సేకరిస్తున్నారు. టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఈ భూముల్లో రోడ్లు, కరెంట్, వాటర్, డ్రైనేజీలు వంటి సౌలత్​లు డెవలప్​మెంట్​ చేసిన తర్వాత పారిశ్రామికవేత్తలకు కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం వేంపల్లి శివారులోని 156, 157, 158, 159 సర్వే నంబర్లతో పాటు పోచంపాడ్​శివారు 1 సర్వే నంబర్​లోని భూములను సేకరించేందుకు ప్రభుత్వం వాలంటరీ ల్యాండ్​అక్విజిషన్ జీవో జారీ చేసింది. అయితే టీజీఐఐసీ సేకరిస్తున్న ఈ భూముల్లో ఎక్కువగా ఎస్సీలకు చెందిన అసైన్డ్ ల్యాండ్స్​ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి వైఎస్సార్​ ప్రభుత్వ హయాంలో ఈ భూములను పంపిణీ చేశారు. వీటిని సేకరించేందుకు కొద్దిరోజులుగా ఎంజాయ్​మెంట్​ సర్వే నిర్వహిస్తున్నారు.

2013 యాక్ట్ ప్రకారం ఇవ్వాలి

2013 భూసేకరణ చట్టం ప్రకారం అసైన్డ్​ ల్యాండ్స్​కు సైతం పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లించాలని పలువురు రైతులు కోరుతున్నారు. ఈ యాక్ట్​ ప్రకారం ఆ ప్రాంతంలో గత మూడేండ్లలో జరిగిన లావాదేవీలను పరిగణనలోకి తీసుకొని ఆ రేటుకు మూడు రెట్లు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. గవర్నమెంట్ వాల్యూ ఎకరానికి రూ.5 లక్షలు ఉన్నట్లయితే దానికి మూడు రెట్లు కలిపి రూ.20 లక్షలు, దానికి వంద శాతం సొలాటియం లెక్కించి మొత్తం రూ.40 లక్షలు చెల్లించాలని కోరుతున్నారు. అసైన్డ్​భూములకు పట్టాలతో సమానంగా పరిహారం చెల్లించాలన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తున్నారు. 

ఆ ఇద్దరు లీడర్ల హల్​చల్

ఇండస్ట్రియల్​హబ్, ఐటీ పార్క్​ కోసం భూసేకరణ విషయంలో హాజీపూర్ ​మండలానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్​ లీడర్లు హల్​చల్ ​చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అసైన్డ్ ​భూములు చేతులు మారడం, పడావుగా ఉండడంతో ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకుంటోందని.. పరిహారం రాదని, ఇచ్చినంత తీసుకొని భూములను అప్పగించాలని రైతులపై ఒత్తిడి చేస్తున్నారు. అందుకు ఒప్పుకోకపోతే బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. ఈ నెల 5న మంచిర్యాల గోదావరి రోడ్​లోని ఓ ఫంక్షన్​హాల్​లో రైతులతో మీటింగ్​ ఏర్పాటు చేసి రూల్స్​కు విరుద్ధంగా వారి నుంచి సంతకాల సేకరణ వరకు అధికారులు చేయాల్సిన పనులను వీరే ముందుండి చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

బలవంతంగా సంతకాలు తీసుకుంటున్రు

గ్రామంలోని భూమి లేని పలువురు ఎస్సీలకు అప్పటి వైఎస్సార్​ ప్రభుత్వం అసైన్డ్​ పట్టాలు ఇచ్చింది. మా అమ్మ లక్ష్మి పేరిట అర ఎకరం భూమి ఉంది. అక్కడ ఇండస్ట్రియల్​ పార్క్​పెడుతామంటూ భూములు లాక్కుంటున్నరు. బలవంతంగా రైతుల సంతకాలు తీసుకుంటున్నరు. ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి.  
- గజెల్లి శేఖర్​, ముల్కల్ల

భూసేకరణపై అనుమానాలున్నయ్ 

గతంలో కాంగ్రెస్​ ప్రభుత్వం మా తాత లింగయ్య పేరిట రెండెకరాల అసైన్డ్ పట్టా ఇచ్చింది. తాత చనిపోయిన తర్వాత మా తండ్రి పేరిట విరాసత్ ​చేసుకుందామని రెవెన్యూ ఆఫీస్​కు పోతే అట్ల చేయరాదన్నరు. ఇటీవల ఇండస్ట్రియల్​ హబ్​ కోసం కొంతమంది లీడర్లు భూములు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నరు. ఈ భూసేకరణపై మాకు అనుమానాలున్నయ్. - మాడుగుల సతీశ్, వేంపల్లి