డిగ్రీలో ఇక కామన్ సిలబస్

  • రెడీ చేస్తున్న హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నాలుగు కమిటీల ఏర్పాటు
  • 2025–26 నుంచే అమల్లోకి
  • చదువుతో పాటు ఫీల్డ్ విజిట్స్ ఉండేలా రూపకల్పన

 హైదరాబాద్, వెలుగు:  అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కోర్సుల్లో కామన్ సిలబస్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు కొత్త సిలబస్ తయారు చేసే పనిలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ బిజీగా ఉన్నది. మెరుగైన విద్యను అందించడంతో పాటు జాబ్ ఓరియంటెడ్ సిలబస్​ను తయారు చేస్తున్నది. దీనికోసం నాలుగు ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. 2025–26 విద్యాసంవత్సరం నుంచే దీన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,100 వరకు డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో ప్రతిఏటా రెండున్నర లక్షల మంది వరకు అడ్మిషన్లు తీసుకుంటున్నారు.

ప్రస్తుతం డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సులుండగా, వాటికి కాంబినేషన్​ గా సుమారు 500 కోర్సులు కొనసాగుతున్నాయి. బకెట్ సిస్టమ్ తీసుకొచ్చాక.. వందల సంఖ్యలో కాంబినేషన్ కోర్సులు పెరిగాయి. అయితే, ఆయా కోర్సులకు తగ్గట్టుగా సరైన సిలబస్ లేదనే విమర్శలూ ఉన్నాయి. ఈ క్రమంలో సిలబస్ లో మార్పులు చేయాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు నిర్ణయించారు.
చివరిసారిగా 2019లో కొన్ని సబ్జెక్టుల్లో సిలబస్ మార్చారు.

 ఈసారి అన్ని సబ్జెక్టుల్లో మార్పులు చేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. స్టూడెంట్లలో స్కిల్స్ పెంచడంతో పాటు ఉపాధికి ఉపయోగపడేలా సిలబస్ మార్చనున్నట్టు టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రకటించారు. చదువుతో పాటు ఫీల్డ్ విజిట్స్ ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో ఇంటర్న్ షిప్స్ లు, ప్రాజెక్టు వర్క్స్ తప్పనిసరిగా చేసేలా సిలబస్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లోని అవసరాలకు అనుగుణంగా సిలబస్ లో మార్పులు చేయనున్నారు.

క్రెడిట్స్​పై సమాలోచనలు

డిగ్రీ, ఇంజినీరింగ్ కోర్సుల్లోనూ క్రెడిట్స్ విషయంలో కౌన్సిల్ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఇంజినీరింగ్ నాలుగేండ్ల కోర్సుకు సంబంధించి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఇచ్చిన సిలబస్ ఆధారంగానే క్లాసులు కొనసాగుతున్నాయి. ఇందులో  మార్పులు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ లో 160 క్రెడిట్స్ ఉండగా, దాన్ని మరో పది క్రెడిట్స్ పెంచే ఆలోచనలో ఉన్నారు. దీనికితోడు డిగ్రీలో 150 క్రెడిట్స్ ఉండగా.. దాన్ని తగ్గించే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.

ఇప్పటికే పలుమార్లు కమిటీ సభ్యుల భేటీ

సిలబస్ లో మార్పుల కోసం నాలుగు కమిటీలను ఏర్పాటు చేశారు. కామర్స్, లా, మేనేజ్​మెంట్ కోర్సులకు సిలబస్ తయారీ కోసం కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో సబ్జెక్టు ఎక్స్ పర్ట్ తో కమిటీ వేశారు. సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి కౌన్సిల్ వైస్ చైర్మన్ మహమూద్ నేతృత్వంలో, సోషల్ సైన్సెస్ కోర్సుల కోసం వైస్ చైర్మన్ పురుషోత్తం నేతృత్వంలో, ఇంజినీరింగ్ తదితర కోర్సులకు సంబంధించి కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు కమిటీలు సమావేశాలు నిర్వహించాయి.