​మందుల కొరతపై కంప్లైంట్లు వస్తున్నయ్ : అజయ్ కుమార్​​

  • వైద్య విధాన పరిషత్​ కమిషనర్​ అజయ్ కుమార్​​

జడ్చర్ల, వెలుగు: జడ్చర్లలోని ఏరియా హాస్పిటల్​లో మందుల​కొరతపై ప్రజల నుంచి కంప్లైంట్లు వస్తున్నాయని వైద్య విధాన పరిషత్​ కమిషనర్​ అజయ్​ కుమార్​ తెలిపారు. హాస్పిటల్​కు వస్తున్న రోగులకు అన్ని రకాల మందులు అందించాలని డాక్టర్లకు సూచించారు. జడ్చర్ల ఏరియా హాస్పిటల్​ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

హాస్పిటల్​కు జ్వరాల బారిన పడి వచ్చేవారి సంఖ్య పెరిగిందని, వారిలో డెంగ్యూ లక్షణాలు ఉన్నవారు ఎక్కువగా వస్తున్నారన్నారు. వారికి తగిన వైద్యం అందించాలన్నారు. హాస్పిటల్​లో -ప్రసవాల సంఖ్య రెండు నెలలుగా పెరగక పోవడం సరైంది కాదన్నారు. సిజేరియన్​లు తగ్గించి, నార్మల్​ డెలివరీలు అయ్యేలా చూడాలన్నారు. -పేషంట్  అటెండర్స్​ సేద తీరేందుకు కుర్చీలు, షెడ్​ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఏమైనా కోర్టు కేసులు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించుకోవాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని అన్ని -జిల్లా, ఏరియా, సీహెచ్​సీల్లో ఉండాల్సిన వైద్యులు, సిబ్బంది వివరాలకు సంబంధించిన కేడర్​ స్ట్రెంత్​ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. త్వరలో అన్ని ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. హాస్పిటల్స్​ను తనిఖీ చేసి వాటి స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే జడ్చర్ల ఏరియా హాస్పిటల్​ను విజిట్​ చేశామన్నారు. లిఫ్ట్​ను అందుబాటులోకి తీసుకురావాలని, పెండింగ్​లో ఉన్న డైట్​ బిల్లును వెంటనే మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. ఆయన వెంట ఆర్ఎంవో హరినాథ్, డాక్టర్​ అర్షద్​ అలీ, సూర్య, రచిత, పల్లవి, సత్యనారాయణ, రవి ఉన్నారు.