ప్లాట్లను కబ్జా చేస్తున్నరు.. కాపాడండి

రామచంద్రాపురం, వెలుగు: పైసా పైసా కూడబెట్టి కష్టపడి కొనుక్కున్న ప్లాట్లను కొంతమంది కబ్జా చేస్తున్నారని కొల్లూర్​లక్ష్మీపురం కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం లక్ష్మీపురం లేఔట్​వద్దకు దాదాపు 500 మంది ప్లాట్ ఓనర్స్​చేరుకొని నిరసన చేపట్టారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కొల్లూర్​పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఓనర్స్​వెల్ఫేర్​అసోసియేషన్ నాయకులు నర్సింహా మూర్తి, మోహన్​ రావు, సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. కొల్లూర్​ సర్వే నంబర్​172, 174, 175, 176, 180, 184, 186, 190 లలో ఏర్పాటు చేసిన లక్ష్మీపురం లేఔట్లలో1984 లోనే ప్లాట్లను కొనుగోలు చేశామని తెలిపారు. 

35 ఏళ్లుగా పొజిషన్​లో ఉన్న తమ ప్లాట్లను కొంతమంది బడాబాబులు తప్పుడు పత్రాలతో ఆక్రమించుకోవాలని కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. తప్పుడు డెత్​సర్టిఫికెట్స్​తయారు చేసి దాదాపు 1300 మంది పేదల పొట్టలు కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమకు అనుకూలంగా కోర్టులో, లోకాయుక్తాలో ఆర్డర్లు ​ జారీ అయినా సదరు అక్రమార్కులు తమపై గుండాలతో దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు.

 లోకల్​ రెవెన్యూ అధికారులు కూడా కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వెంటనే తమ ప్లాట్లను కాజేయాలనుకునే వారిపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. ఈ విషయంపై 2022లో రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశామని, కేసులు నమోదైనా వారిపై నేటికీ చర్యలు తీసుకోలేదని వాపోయారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలసి ఫిర్యాదు చేస్తామని

 చెప్పారు.