ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్  విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్  విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు వాటిని అందజేసి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడిషనల్  కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, ఎస్  మోహన్ రావు, డీఆర్వో కేవీవీ రవి కుమార్, జడ్పీ సీఈవో రాఘవేంద్రరావు, డీఆర్డీవో నర్సింలు పాల్గొన్నారు. 

ఆగస్టు 31 వరకు స్టాప్​ డయేరియా

ఆగస్టు 31 వరకు జిల్లాలో స్టాప్​ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్  తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో కలెక్టర్  మాట్లాడారు. 5 ఏండ్ల లోపు చిన్నారులు డయేరియాతో చనిపోకుండా చూడాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సక్షేమ శాఖ కమిషనర్  నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి చిన్నారులకు ఓఆర్ఎస్  ప్యాకెట్లు, జింక్​ ట్యాబ్లెట్లు పంపిణీ చేయాలని, గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వన మహోత్సవంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని ఆదేశించారు. పాత ఇండ్లల్లో ఉంటున్న వారిని గుర్తించి వెంటనే తరలించాలని సూచించారు.

పరిశ్రమలకు పర్మిషన్లు ఇవ్వాలి..

పరిశ్రమలకు పర్మిషన్లను సకాలంలో అందించాలని కలెక్టర్  విజయేందిర బోయి అధికారులకు సూచించారు. పారిశ్రామికాభివృద్ది, ప్రోత్సాహక అంశాలపై రివ్యూ చేశారు. జిల్లాలో ఎస్సీ,ఎస్టీ లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న 15 యూనిట్లకు రూ.50.81 లక్షల రాయితీని మంజూరు చేశారు. పోలేపల్లి సెజ్  చుట్టూ అసంపూర్తిగా ఉన్న కాంపౌండ్​ వాల్​ను వెంటనే నిర్మించాలని ఆదేశించారు. పారిశ్రామిక వ్యర్థాలు బయటకు పంపించకుండా ప్లాంట్ కు తరలించాలని సూచించారు. పరిశ్రమల కేంద్రం జీఎం బాబురావు, లీడ్  బ్యాంక్​ మేనేజర్లు కల్వ భాస్కర్, విజయ్ కుమార్  పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ టౌన్ : ప్రజా ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ బదావత్  సంతోష్  అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్  మీటింగ్  హాల్​లో ప్రజావాణిలో భాగంగా ఫిర్యాదులను స్వీకరించారు. 78 మంది అర్జీలు అందజేశారని, వాటిలో ధరణికి సంబంధించిన వాటితో పాటు ఇతర దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు. అడిషనల్​ కలెక్టర్  కె సీతారామారావు పాల్గొన్నారు.

గద్వాల : ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ లో పెట్టవద్దని గద్వాల కలెక్టర్  సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో 65 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు వాటిని పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్   సూచించారు. అడిషనల్  కలెక్టర్  వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వనపర్తి : ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని వనపర్తి కలెక్టర్  ఆదర్శ్  సురభి ఆదేశించారు. అడిషనల్  కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ఎం నగేశ్​తో కలిసి ప్రజావాణిలో ఫిర్యాదులను స్వీకరించారు. గత వారం వచ్చిన 107 ఫిర్యాదుల్లో పరిష్కారం చేయని వాటిపై శాఖల వారీగా వివరణ అడిగారు. మిగిలిన ఫిర్యాదులను రెండు రోజుల్లో పరిష్కరించి ఆన్​లైన్​లో నమోదు చేయాలని ఆదేశించారు. పరిష్కారం కాని అర్జీలకు సంబంధించి ఉన్నతాధికారులకు, సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వాలని సూచించారు.

వర్షాకాలం ప్రారంభం అయిన దృష్ట్యా జిల్లాలో డయేరియా, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలాఉంటే ఖిల్లాగణపురం మండలం ఉప్పరిపల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్​ పాత బిల్డింగ్​ పెచ్చులూడుతోందని, కొత్త బిల్డింగ్​ మంజూరైనా మధ్యలోనే ఆగిపోయిందని గ్రామస్తులు కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లారు. పాత బిల్డింగ్​కు రిపేర్లు చేయడంతో సరి పెట్టకుండా కొత్త బిల్డింగ్​ నిర్మించాలని కోరారు.