మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీని పరిశీలించి తప్పులు ఉంటే సవరించాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం మయూరి ఎకో పార్క్ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర సర్వే, ధరణి, సీఎం కప్, జీపీల్లోని పోలింగ్ స్టేషన్లు, ఓటర్ జాబితా సవరణలపై చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీపీలు, వార్డుల వారీగా సమగ్ర సర్వే డేటాను పరిశీలించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాను ఈ నెల 7న జీపీల్లో ప్రదర్శించాలన్నారు. అంతకుముందు సీఎం కప్ పోటీల నిర్వహణపై పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో అధికారులు, పీఈటీలు, క్రీడా సంఘాలతో చర్చించారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్ రావు, అడిషనల్ఎస్పీ రాములు, డీఈవో ప్రవీణ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, జిల్లా క్రీడలు యువజన అధికారి ఎస్ శ్రీనివాస్ పాల్గొన్నారు.