రోగులకు మెరుగైన వైద్యం అందించాలి : కలెక్టర్  విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు:  ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్  విజయేందిర బోయి ఆదేశించారు. బుధవారం జిల్లా జనరల్  ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఐసీయూ, ఇంజక్షన్ వార్డు, డెంటల్  విభాగం, అల్ట్రా సౌండ్  స్కానింగ్  రూం, సెంట్రల్  లేబరేటరీలను పరిశీలించారు. డాక్టర్లు, రోగులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది హాజరు, మానిటరింగ్  ఎలా చేస్తున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్  జీవన్​ను అడిగి తెలుసుకున్నారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా పారిశుధ్య సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను పెంచాలని ఆయన కలెక్టర్ ను కోరారు. గైనాకాలజీ హెచ్​వోడీ రాధ, ఆర్ఎంవోలు దుర్గ, శిరీష ఉన్నారు.

నవాబుపేట: మండలకేంద్రంలోని తహసీల్దార్, పీహెచ్ సీలను కలెక్టర్  విజయేందిర బోయి తనిఖీ చేశారు. అటెండెన్స్​ రిజిష్టర్లను, ఆపరేషన్ థియేటర్, వార్డులను పరిశీలించారు. ఓపీ పేషెంట్​ వివరాలను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. అనంతరం తహసీల్దార్  ఆఫీస్​ను తనిఖీ చేసి, ధరణి దరఖాస్తులు, పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లపై రివ్యూ చేశారు. 58 దరఖాస్తులు పెండింగ్ లో  ఉన్నాయని, రిపోర్ట్​లు అప్ లోడ్  చేస్తామని తహసీల్దార్  తెలిపారు. 

గండీడ్: ధరణి దరఖాస్తులను వెంటనే క్లియర్​ చేయాలని కలెక్టర్  విజయేందిర బోయి ఆదేశించారు. మహమ్మదాబాద్  తహసీల్దార్ ఆఫీస్​ను కలెక్టర్​ విజిట్  చేశారు. తహసీల్దార్  ఆఫీస్​లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవా కేంద్రాన్ని పరిశీలించి, ప్రజలకు  ఇబ్బంది కలగకుండా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పెండింగ్​లో ఉన్న 21 ధరణి దరఖాస్తులను త్వరగా  పరిష్కరించాలని ఆదేశించారు. జడ్పీ హైస్కూల్​ను సందర్శించి టెన్త్​ స్టూడెంట్లతో మాట్లాడారు. ప్రణాళిక ప్రకారం చదివి మంచి మార్కులతో పాస్  కావాలని సూచించారు. తహసీల్దార్  తిరుపతయ్య ఉన్నారు.