మహబూబ్ నగర్ లో కుక్కల నియంత్రణపై దృష్టి పెట్టాలి : కలెక్టర్  విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పట్టణంలో కుక్కల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్  విజయేందిర బోయి సూచించారు. జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వీధి కుక్కలకు నిర్వహిస్తున్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై మున్సిపల్  కమిషనర్, పశు సంవర్ధక శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు 10 వీధి కుక్కలకు ఆపరేషన్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రతి రోజు 50 వీధి కుక్కలకు ఆపరేషన్లు నిర్వహించాలని ఆదేశించారు.

జంతు జనన నియంత్రణ కేంద్రంలో జడ్చర్ల, భూత్పూర్​ మున్సిపాలిటీల్లోని కుక్కలకు ఆపరేషన్లు చేయాలని సూచించారు. అనంతరం రామయ్య బోలిలో ముంపునకు గురయ్యే ప్రాంతాన్ని సందర్శించారు. శివశక్తి నగర్  పక్కన ఉన్న కాల్వలోకి వరద నీటిని డైవర్ట్  చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. డ్రెయిన్  అంచున ఉన్న సక్సెస్  స్కూల్  యాజమాన్యాన్ని అప్రమత్తం చేయాలని మున్సిపల్  కమిషనర్ ను ఆదేశించారు. అడిషనల్  కలెక్టర్  శివేంద్రప్రతాప్, పశు సంవర్ధక శాఖ జేడీ మధుసూదన్, మున్సిపల్  కమిషనర్  మహేశ్వర్ రెడ్డి, పశు సంవర్ధక శాఖ ఏడీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

స్కూల్  తనిఖీ.. 

హన్వాడ: మండలంలోని సల్లోనిపల్లి ప్రైమరీ స్కూల్​ను కలెక్టర్  విజయేందిర బోయి తనిఖీ చేశారు. స్కూల్  విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థులు పాఠాలు సరిగా చదవ లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలని, బట్టీ పట్టడంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. ముందుగా మండలంలోని సర్వే నంబర్  718లో ప్రభుత్వ భూమిని కలెక్టర్  పరిశీలించారు. అడిషనల్​ కలెక్టర్  ఎస్  మోహన్ రావు, తహసీల్దార్  కిష్టానాయక్, మాజీ ఎంపీపీ బాలరాజు, సర్వేయర్  సాయి పాల్గొన్నారు.