విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉంటే  కఠిన చర్యలు : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

  • స్కూళ్లు, హాస్టళ్లలో మెనూ తప్పనిసరిగా అమలు చేయాలి
  • కేజీబీవీలు, గురుకులాల్లో కలెక్టర్ల ఆకస్మిక తనిఖీలు
  • భోజనానికి తాజా కూరగాయలు, నాణ్యమైన సరుకులు మాత్రమే వాడాలని ఆదేశం 

ఆసిఫాబాద్/నేరడిగొండ/జైపూర్, వెలుగు: వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్​పాయిజన్​కారణంగా ట్రీట్​మెంట్​పొందుతూ విద్యార్థిని చౌదరి శైలజ చనిపోవడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్లు తమ జిల్లా పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్టూడెంట్స్ ఆరోగ్యంపై నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే హెచ్చరించారు.

బుధవారం జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, మధ్యాహ్న భోజనం నాణ్యత, సామగ్రి నిల్వలను పరిశీలించారు. తాజా కూరగాయలు, నాణ్యత గల సరుకులను మాత్రమే వంటకు వినియోగించాలని సూచించారు. స్కూళ్లు, వసతి గృహాలు, గురుకు లాల్లో భోజనం మెరుగ్గా అందేలా అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. 

అధికారులతో రివ్యూ

ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థులకు కేటాయించిన మెనూ తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి ఎంఈవోలు, హెచ్ఎంలతో రివ్యూ నిర్వహించారు. విద్యార్థులకు సకాలంలో మోను ప్రకారం నాణ్యమైన భోజనం, శుద్ధమైన తాగునీరు అందించాలని సూచించారు. కిచెన్ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, తాజా కూరగాయలు, నాణ్యమైన సరుకులు వినియోగించాలన్నారు. భోజనానికి ముందు చేతులు శుభ్రంగా ఉంచుకునేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. టీచర్లు తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. 

నాణ్యమైన భోజనం అందిస్తున్నారా? 

నాణ్యమైన భోజనం అందిస్తున్నారా, నాణ్యతను పరిశీలిస్తున్నారా అని స్టూడెంట్స్ ను ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అడిగి తెలుసుకున్నారు. నేరడిగొండ మండలంలోని కేజీబీవీ స్కూల్ ను ఆయన తనిఖీ చేశారు. వంటగదిని, స్టోర్ రూమ్​లో నిల్వ ఉంచిన బియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, 
వాటి కాలపరిమితిని పరిశీలించారు. నాసిరకమైన బియ్యం, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు సప్లై చేసినట్లయితే స్పెషల్ ఆఫీసర్లకు తెలియజేయాలని సూచించారు. విద్యార్థుల  భోజనం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు  తప్పవని హెచ్చరిం చారు.

ప్రతిరోజూ ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు. వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం మండలంలోని ఎంపీడీవో, ఎమ్మార్వో ఆఫీస్ లో కొనసాగుతున్న ఇంటింటి సర్వే డేటా ఎంట్రీని పరిశీలించారు. తహసీల్దార్​ఖలీం, ఎంపీడీవో రాజ్ వీర్, ఆర్ఐ నాగోరావు, ఎంఈవో భూమారెడ్డి, కేజీబీవీ ఎస్ వో రజిత, ఇతర ఆఫీసర్లు  ఉన్నారు.

వంట గదులను  పరిశుభ్రంగా ఉంచాలి

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జైపూర్​మండల కేంద్రంలోని గురుకుల సంక్షేమ బాలుర, కేజీబీవీ స్కూళ్లను ఆకస్మికంగా సందర్శించారు. వంట గదులను తనిఖీ చేసి భోజనాన్ని పరిశీలించారు. వంట గదులను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు మెను ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. హాస్టళ్లలో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. శెట్​పల్లి, గంగిపల్లిలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, కేజీబీవీ ఎస్వో ఫణిబాల, గురుకుల స్కూల్  ప్రిన్సిపాల్​ నాగేశ్వర్ రావు ఉన్నారు.