దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి : కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: భారత రాజ్యాంగం ప్రకారం..  కులమతాలకు అతీతంగా దేశాభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి స్మరించుకున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు .

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.‘హమారా విధానం, సంవిధాన్ - హమారా స్వాభిమాన్’ అనే నినాదంతో కార్యక్రమం సాగింది. కలెక్టర్ మాట్లాడుతూ..  భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆవిష్కరించిన విలువలను గౌరవించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. డీఆర్‌‌ఓ పద్మజారాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

టెన్త్ లో మెరుగైన ఫలితాలు సాధించాలి

టెన్త్ యాన్యువల్ ఎగ్జామ్స్ లో గత ఏడాది కన్నా మెరుగైన ఫలితాలు సాధించేలా సమిష్టిగా కృషి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. కలెక్టరేట్ లో విద్యాశాఖ ఆధ్వర్యంలో టెన్త్ రిజల్ట్స్, టీచర్ గైడ్లైన్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్​ఎంలుగా ప్రమోషన్​ పొందిన వారు బాధ్యతగా పనిచేయాలన్నారు.

మధ్యాహ్న భోజనంలో వారంలో ఒక టీచర్ విద్యార్థులతో కలిసి భోజనం చేయాలన్నారు. డీఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గతేడాది టెన్త్​లో 97.85 శాతం రిజల్ట్ తో రాష్ట్రంలో ఐదో స్థానం సాధించామని, ఈ సారి మెరుగైన స్థానం కోసం ప్రయత్నం చేస్తామన్నారు. టీచర్ల సర్వీస్ రూల్స్ పై హెచ్​ఎం నాగభూషణం అవగాహన కల్పించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృత, ఏడీ శంకర్ పాల్గొన్నారు.