మెదక్ కలెక్టరేట్​లో ఏదీ భద్రత

  • సీపీఓ ఫైర్​ యాక్సిడెంట్​ పై విచారణకు ఆదేశించిన కలెక్టర్
  • గడువు ముగిసిన పరికరాలు.. రీఫిల్​ చేయని కాంట్రాక్టర్

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి కలెక్టరేట్ లో ఫైర్​ సేఫ్టీ సిస్టమ్ గురించి పట్టించుకునే వాళ్లే కరువయ్యారు. జిల్లా కలెక్టర్​తో పాటు అధికార యంత్రాంగం అంతా కొలువు దీరే ఇక్కడ అనుకోని ప్రమాదం జరిగితే కాపాడేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేవు. అగ్నికి ఆర్పే పరికరాలు అలంకారంగా మారాయి, ఎక్స్ పైరీ అయినా అధికారులకు పరికరాలను మార్చే సోయి లేదు. కలెక్టరేట్​ లోని చీఫ్​ ప్లానింగ్​ ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ కారణంగా సోమవారం జరిగిన ఫైర్​ యాక్సిడెంట్​భద్రతావైఫల్యాన్ని బయట పెట్టింది. కలెక్టరేట్ మొదటి అంతస్తులో ఉన్న సీపీఓ ఆఫీసులో మంటలు వ్యాపించి ఫైళ్లు కాలిపోయాయి.

 ఈ ఘటనపై కలెక్టర్ క్రాంతి వల్లూరు విచారణకు ఆదేశించారు. ప్రమాదం ఎలా జరిగింది, ఫైర్ సేఫ్టీ పరికరాలు ఎందుకు ఉపయోగించలేదు, అసలు పరికరాలు ఉన్నాయా లేదా అన్న చర్చ సాగుతోంది. సేఫ్టీ పరికరాలు ఉన్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వల్లనే వెంటనే మంటలు ఆర్పలేక పోయినట్టు ఉద్యోగులు అనుకుంటున్నారు. 

గడువు ముగిసిన పరికరాలు 

సంగారెడ్డి కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన ఫైర్ ఎక్స్ టీంగ్విషర్ ల గడువు 5 నెలల కిందటే ముగిసింది. 2023 జూన్ 23న ఫైర్ ఎక్స్ టీంగ్విషర్ లను ఏర్పాటు చేయగా, వాటి గడువు 2024 జూన్ 23తో ముగిసింది. వెంటనే రీఫిల్ చేయాల్సిన అధికారులు పట్టించుకోలేదు. కాంట్రాక్టర్ కు రూ. 6, 50 లక్షల మేర పాత బిల్లులు పెండింగ్ లో ఉన్నట్టు చెప్తున్నారు. భువనగిరికి చెందిన ఓ కాంట్రాక్టర్ కు సేఫ్టీ పరికరాలు బిగించడంతోపాటు రీఫిల్ బాధ్యతలను అప్పగించారు. అధికారుల చుట్టూ తిరిగినా పాత బకాయిలు చెల్లించడం లేదని, బకాయిలు ఇచ్చేవరకు రీఫిల్ చేయలేనని ఆ కాంట్రాక్టర్ ఆఫీసర్లకు తేల్చిచెప్పినట్టు తెలిసింది.

 ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​లో మొత్తం 45 ప్రభుత్వ శాఖలనే సంబంధించిన ఆఫీసులున్నాయి. ఇంత పెద్ద కాంప్లెక్స్​లో కేవలం 15 ఫైర్ ఎక్స్ టీంగ్విషర్ లనే అమర్చారు. సీపీఓ ఆఫీసులో జరిగిన ఘటన చిన్నదని, భవిష్యత్తులో అనుకోని ప్రమాదాలు జరిగితే అధికారులకు, ఉద్యోగులకు, ప్రజలకు భద్రత ఎలా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అరకొర పరికరాలు, అంతులేని నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారకముందే అధికారులు స్పందించాలని ఉద్యోగవర్గాలు భావిస్తున్నాయి.