ఇందిరమ్మ ఇండ్ల సర్వే నెలాఖరులోపు పూర్తి చేయాలి : వల్లూరు క్రాంతి

  • సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి 
  • ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి టౌన్ , వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల సర్వేను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.  సోమవారం ప్రజావాణిలో ఆమె పాల్గొన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.  మొత్తం 68 దరఖాస్తులు రాగా,  వివిధ శాఖలకు చెందిన అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరించాలని ఆదేశించారు.  జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ..  ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారుల గుర్తింపును ఈ నెల చివరి వరకు పూర్తి చేయాలన్నారు.

 మొబైల్ యాప్ లో వివరాలను  పొందుపర్చాలన్నారు. ఎలాంటి వివాదాలు, అవకతవకలకు తావులేకుండా సర్వే ప్రక్రియను నిజాయతీగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ , డీఆర్‌‌‌‌వో పద్మజారాణి , డీపీఓ సాయిబాబా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అగ్ని వీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి 

సంగారెడ్డి టౌన్ , వెలుగు: త్రివిధ దళాల్లో అగ్నివీర్ ఉద్యోగాలకు జిల్లాలోని నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఒక ప్రకటనలో తెలిపారు. అగ్ని వీర్ ఉద్యోగాలకు 2005 జనవరి 1 నుంచి 2008 జులై 1వ తేదీ మధ్యలో జన్మించిన వారు అర్హులన్నారు. జనవరి1నుంచి 27వ తేదీ వరకు అగ్ని వీర్ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో అఫ్లై చేసుకోవాలని  సూచించారు. మార్చి 22వ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు, ఆన్లైన్ దరఖాస్తులకు https:/agnipathvayu.cdca.in/. వెబ్‌‌ సైట్‌‌లో   దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.