అంగన్ వాడీ సెంటర్లను పకడ్బందీగా నిర్వహించాలి : తేజస్  నందలాల్  పవార్

వనపర్తి, వెలుగు: జిల్లాలోని అంగన్ వాడీ కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్  తేజస్  నందలాల్  పవార్  సూచించారు. బుధవారం కలెక్టరేట్​లో డీడబ్ల్యూవో, సీడీపీవోలు, అంగన్​వాడీ సూపర్ వైజర్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అంగన్​వాడీ సెంటర్ల పరిధిలో ఎత్తుకు తగిన బరువు లేని పిల్లలను పీహెచ్ సీకి పంపించి ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు.

ఆశా వర్కర్లతో అంగన్​వాడీ కార్యకర్తలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి సెంటర్​లో గర్భిణులు, బాలింతలతో కమిటీ ఏర్పాటు చేసి ప్రతి నెలా పోషకాహారంపై సమావేశం నిర్వహించాలన్నారు. సెంటర్లలో సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని, వాటిని వెంటనే పరిష్కరిస్తానని చెప్పారు. బియ్యం పంపిణీలో ఆలస్యమవుతోందని సూపర్​వైజర్లు తెలపగా, ఇలాంటి సమస్య రాకుండా చూడాలని పౌర సరఫరాల అధికారులకు సూచించారు. డీఎంహెచ్​వో జయ చంద్రమోహన్, డీడబ్ల్యూవో లక్ష్మీబాయి, డీఎస్​వో శ్రీనాథ్, సీడీపీవోలు, సూపర్​వైజర్లు పాల్గొన్నారు.