కొనుగోలు కేంద్రాల్లో సౌలతులు కల్పించాలి : తేజస్  నందలాల్  పవార్

గోపాల్ పేట, వెలుగు: వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు పూర్తి స్థాయిలో సౌలతులు కల్పించాలని వనపర్తి కలెక్టర్  తేజస్  నందలాల్  పవార్   ఆదేశించారు. బుధవారం మండలంలోని ధనసింగ్ తండాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్​ కలెక్టర్  ఎం.నగేశ్, స్పెషల్​ ఆఫీసర్​ లక్ష్మీబాయితో కలిసి  ప్రారంభించారు. అనంతరం కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

రైతులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తండాలో తాగునీటి సరఫరాకు తీసుకుంటున్న చర్యలను పంచాయతీ సెక్రటరీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్​సీని కలెక్టర్  సందర్శించి రికార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యం ఎలా చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. పీహెచ్​సీకి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు.

అలాగే మిషన్  భగీరథ పంప్  హౌజ్ ను పరిశీలించారు. పంప్ హౌజ్ లో జరుగుతున్న వాటర్  ట్రీట్ మెంట్ పై ఆరా తీశారు. అనంతరం తహసీల్దార్  ఆఫీస్​లో తాగునీటి సరఫరాపై రివ్యూ నిర్వహించారు. గ్రామాల్లో నీటి కొరత ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. డీడబ్ల్యూవో లక్ష్మీబాయి, తహసీల్దార్​ శ్రీనివాసులు, ఎంపీవో హుస్సేనప్ప, పంచాయతీ కార్యదర్శి బాలరాజు, ఎస్ఈ  జగన్మోహన్, ఈఈ మేఘారెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్​వో శ్రీనివాసులు, వైద్యాధికారులు కృష్ణ కుమారి, మమత ఉన్నారు.