నిష్పక్షపాతంగా డ్యూటీ చేయాలి : తేజస్ నందలాల్ పవార్

వనపర్తి, వెలుగు: వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా డ్యూటీ చేయాలని కలెక్టర్​ తేజస్  నందలాల్  పవార్  ఆదేశించారు.  గురువారం కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్​లో పార్లమెంటు ఎన్నికల నిర్వహణపై ఎస్పీ రక్షిత కృష్ణమూర్తితో కలిసి నోడల్, సెక్టోరియల్ ఆఫీసర్లు, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ టీమ్స్, పోలీస్  ఆఫీసర్లతో ఎన్నికల నిర్వహణ, బాధ్యతల పై అవగాహనా, శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.  

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో తప్పులు జరగకుండా చూసుకోవాలన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని పోలీస్​ ఆఫీసర్లకు సూచించారు. అధికారులు రాజకీయ నాయకులను కలవడం, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం  చేయవద్దని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బెల్ట్​ షాపులు, బైండోవర్  కేసుల విషయంలో పక్కాగా ఉండాలన్నారు. అడిషనల్​ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ఎం నగేశ్, డీఎఫ్ వో నవీన్, ఆర్డీవో పద్మావతి, డీఎస్పీ వెంకటేశ్వర్  పాల్గొన్నారు.

పెండింగ్​ సీఎంఆర్​ వెంటనే ఇవ్వాలి

మూడేండ్లుగా పెండింగ్​లో ఉన్న సీఎంఆర్ ను వెంటనే అందించాలని కలెక్టర్​ తేజస్​ నందలాల్​ పవార్​ ఆదేశించారు. గురువారం తన చాంబర్​లో జిల్లా రైస్​ మిల్లర్ల అసోసియేషన్​ సభ్యులు, సివిల్​ సప్లై ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ, 2020-–21, 2021–-22 సంవత్సరాల ఖరీఫ్​, రబీ సీజన్​లకు సంబంధించిన 430 ఏసీకేల బియ్యం సివిల్​ సప్లయ్​కి, 2022–-23 రబీ సీజన్​కు సంబంధించి పెండింగ్​లో ఉన్న 546 ఏసీకేల బియ్యాన్ని ఎఫ్​సీఐకి అప్పగించాలన్నారు. 2023–-24 ఖరీఫ్​ సీజన్​కు సంబంధించి 71 మంది రైస్​ మిల్లర్లు 4,418 ఏసీకేల ధాన్యాన్ని కూడా వీలైనంత త్వరగా అందించాలని ఆదేశించారు. అడిషనల్​ కలెక్టర్లు నగేశ్, సంచిత్​ గంగ్వార్  పాల్గొన్నారు.