యువతకు డ్రగ్స్​పై అవగాహన కల్పించాలి : తేజస్ నందలాల్ పవార్

వనపర్తి టౌన్, వెలుగు : జిల్లాలో యువత డ్రగ్స్, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని కలెక్టర్  తేజస్  నందలాల్  పవార్  అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో మాదక ద్రవ్యాల నియంత్రణ జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ స్కూళ్లు, కాలేజీలు తెరిచేనాటికి డ్రగ్స్​ వాడకంతో జరిగే నష్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. 

ఇందుకోసం ఒక ప్రత్యేక టీమ్​ ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా  పోలీస్, వైద్యారోగ్య శాఖ ద్వారా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో కృష్ణా నదీ తీరప్రాంతంలో గంజాయి సాగు చేసే అవకాశం ఉందని, దీనిని అరికట్టేందుకు వ్యవసాయ, అటవీ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో నిఘా ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి సాగు చేస్తూ పట్టుబడితే క్రిమినల్  కేసులు పెట్టడమే కాకుండా రైతుబంధు రద్దు చేయాలన్నారు. అడిషనల్  కలెక్టర్  ఎం నగేశ్, తహసీల్దార్  కిషన్ నాయక్, అడిషనల్  ఎస్పీ రామదాసు తేజావత్, ఆర్డీవో పద్మావతి పాల్గొన్నారు.

అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి..

జిల్లాలో అనుమతి లేకుండా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్  తేజస్  నందలాల్  పవార్  అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో మన ఇసుక వాహనం స్కీంపై జిల్లా స్థాయి కమిటీతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ గృహ నిర్మాణాలు, ప్రభుత్వ పనులకు నాణ్యమైన ఇసుకను అందుబాటులో ఉంచేలా తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. 

జిల్లాలో ఇసుక మాఫియా లేకుండా చేసేందుకు పంచాయతీ సెక్రటరీ నుంచి అనుమతి పొందిన ఇండ్లు, ఇంజనీరింగ్  అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వ నిర్మాణాలకు ఇసుక సప్లై చేసేలా తహసీల్దార్లకు వే బిల్​ పర్మిషన్​ ఇచ్చినట్లు చెప్పారు. పర్మిషన్​ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ ఇసుక తరలింపుపై రెవెన్యూ, పోలీస్, మైనింగ్  ఆఫీసర్లు నిఘా పెట్టి అరికట్టాలని ఆదేశించారు. అడిషనల్  కలెక్టర్ ఎం నగేశ్, మైనింగ్  ఏడీ శ్రీనివాస్, తహసీల్దార్  కిషన్ నాయక్  పాల్గొన్నారు.