భాగ్యరెడ్డి వర్మ ఆశయాలను నెరవేర్చాలి : తేజస్  నందలాల్  పవార్

వనపర్తి, వెలుగు: భాగ్య రెడ్డి వర్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్  తేజస్  నందలాల్  పవార్  పిలుపునిచ్చారు.  బుధవారం భాగ్యరెడ్డి వర్మ జయంతిని కలెక్టరేట్​లో అధికారికంగా నిర్వహించారు. కలెక్టర్, అడిషనల్​ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, నగేశ్​ఆయన ఫొటోకు పూలమాలలు వేసి  నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ దళితులు, అణగారినవర్గాల అభ్యున్నతికి భాగ్యరెడ్డి వర్మ కృషి చేశారని, విద్యతోనే దళితులు ఆత్మగౌరవం, అభివృద్ధి సాధించగలరనే  విశ్వాసంతో  హైదారాబాద్ లో దళితుల కోసం 30 పాఠశాలలు ఏర్పాటు చేశారని చెప్పారు.

హిందూ సమాజంలోని అస్పృశ్యత, అంటరానితనం పై అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు. సమాజంలో ఉన్న జోగిని,  దేవదాసి, వెట్టిచాకిరి  వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించి సమాజంలో మార్పు కోసం కృషి చేశారన్నారు. ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు. ఎస్సీ డెవలప్​మెంట్​ ఆఫీసర్​ నుషిత, జిల్లా అధికారులు, జేఏసీ  నాయకులు రాజారాంప్రకాశ్, నాగరాజు, గిరిరాజా చారి,   వెంకటస్వామి, కలెక్టరేట్  సిబ్బంది పాల్గొన్నారు.