విత్తనాల కోసం రైతులు ఆందోళన చెందవద్దు : తేజస్ నందలాల్ పవార్

వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలో వర్షాకాలం సాగుకు అవసరమైన నాణ్యమైన పత్తి, వరి విత్తనాలు డీలర్ల దగ్గర అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ తేజస్  నందలాల్  పవార్  తెలిపారు. శుక్రవారం కొత్తకోటలోని మన గ్రోమోర్, ఆత్మకూరులోని అగ్రి రైతు సేవా కేంద్రం, జై కిసాన్  షాపులను కలెక్టర్  తనిఖీ చేశారు. విత్తనాలు, ఎరువుల నిల్వలు, అమ్ముడు పోయిన వాటి రికార్డులను పరిశీలించారు. ఎక్కువగా ఏ బ్రాండ్  విత్తనాలకు డిమాండ్  ఉందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.  

జిల్లాకు 14,350 పత్తి విత్తన పాకెట్స్ రాగా, అందులో ఇప్పటివరకు కేవలం 2,512 అమ్ముడయ్యాయని తెలిపారు. విత్తనాలకు సంబంధించి ఎక్కడైనా కొరత ఉంటే కలెక్టరేట్  కంట్రోల్  రూమ్  హెల్ప్ లైన్  నెంబర్  08545–233525 కి కాల్  చేయాలని సూచించారు. కంట్రోల్  రూమ్ లో స్టాక్  పొజిషన్  వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా వ్యవసాయ శాఖ  అధికారులకు సూచించారు. విత్తనాల విషయంలో రైతులను మోసపోకుండా మండలాల వారీగా వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా నాసిరకం విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. 

రిపేర్లను వెంటనే పూర్తి చేయాలి..


ప్రభుత్వ బడుల్లో పిల్లలకు అన్ని రకాల సౌలతులు కల్పించేందుకు అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద రిపేర్లు చేపట్టామని, ఈ పనులు వేగంగా జరుగుతున్నాయని కలెక్టర్  తెలిపారు. శుక్రవారం ఆత్మకూరు మండలకేంద్రంలోని వడ్డెగేరి ప్రైమరీ, జడ్పీ ఉర్దూ హైస్కూల్​ను సందర్శించారు.  బడుల్లో పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. డీఏవో డి చంద్రశేఖర్, కొత్తకోట ఏడిఏ దామోదర్, ఆత్మకూరు తహసీల్దార్  రాజు, ఎంఈవో భాస్కర్, ఎంపీవో నర్సింగ్ రావు, ఎంపీడీవో సుజాత, ఏఈవో మహేశ్వరి పాల్గొన్నారు.


నారాయణపేట, వెలుగు: వానాకాలం సాగుకు జిల్లా రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్  కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్​ మీటింగ్​ హాల్​లో ఎస్పీ యోగేశ్​ గౌతమ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్ ల ద్వారా శుక్రవారం వరకు 999.60 క్వింటాళ్ల విత్తనాలు 60 శాతం సబ్సిడీపై అందించినట్లు చెప్పారు. మిగిలిన 700.4 క్వింటాళ్ల విత్తనాలు వారంలోగా సప్లై చేస్తామన్నారు. 3.70 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం కాగా, ఇప్పటికే 3,82,741 ప్యాకెట్లు 245 షాపుల్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. 

లైసెన్స్​ కలిగిన డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి, రసీదు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మితే వారి వివరాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే 5 కేసులు నమోదు చేశామని, 10 క్వింటాళ్ల లూజ్  విత్తనాలు పట్టుకున్నామని చెప్పారు. డీఏవో జాన్ సుధాకర్, డీపీఆర్వో ఎంఏ రశీద్  పాల్గొన్నారు.