అన్ని పోలింగ్ స్టేషన్లలో లైవ్  వెబ్  కాస్టింగ్ : కలెక్టర్  సంతోష్

గద్వాల, వెలుగు: పార్లమెంట్ ఎన్నికలను పక్కాగా నిర్వహించేందుకు జిల్లాలోని అన్ని పోలింగ్  స్టేషన్లలో లైవ్  వెబ్  కాస్టింగ్  కోసం ప్రపోజల్స్​  పంపినట్లు కలెక్టర్  సంతోష్  తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్  ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామన్నారు. నాగర్ కర్నూల్(ఎస్సీ) నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల కోసం గద్వాలలో 303, అలంపూర్ లో 290 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

అలంపూర్  మండలంలోని సింగవరం గ్రామంలో కొత్త పోలింగ్  స్టేషన్  ఏర్పాటు కోసం ప్రపోజల్ పంపించామని తెలిపారు. జిల్లాలో 4,94,945 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 2,43,353 మంది పురుషులు, 2,51,573 మంది మహిళలు, 19 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారని తెలిపారు.  గద్వాల నియోజకవర్గంలో 1,25,356 మంది పురుషులు, 1,30,499 మంది మహిళలతో పాటు 11 మంది ట్రాన్స్ జెండర్లు ఉండగా, అలంపూర్ లో 1,17,997 మంది పురుషులు, 1,21,074 మంత్రి మహిళలు, 8 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారన్నారు.

గద్వాల నియోజకవర్గంలో 4,588 మంది, అలంపూర్  నియోజకవర్గంలో 6,216 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారని చెప్పారు. జిల్లాలో 65 మంది సెక్టార్  ఆఫీసర్లను ఏర్పాటు చేశామని, 18 ఫ్లయింగ్  స్క్వాడ్  టీమ్స్​ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈవీఎంల తరలింపు, ఆఫీసర్ల నియామకాలు ర్యాండమ్​గా జరుగుతుందని చెప్పారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు.