పొలాలకు వెళ్లేందుకు సర్వీస్ రోడ్డు వేస్తాం : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు : భారత్ మాల రోడ్డు దగ్గర రైతులు పొలాలకు వెళ్లేందుకు  అవసరమైన సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేసి కనెక్టివిటీ అందిస్తామని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు.  మంగళవారం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి గట్టు మండలం తప్పెట్ల మరుసు ఆరగిద్ద గ్రామాల్లో జరుగుతున్న భారత్ మాల నిర్మాణ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా హైవే అథారిటీ అధికారులతో రోడ్డు నిర్మాణాలకు సంబంధించిన భూముల వివరాలను మ్యాపింగ్ ద్వారా పరిశీలించారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రహదారి నిర్మాణంలో భాగంగా భూములకు సర్వీస్ రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.  అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..  రైతుల డిమాండ్ మేరకు అవసరమైన సర్వీస్ రోడ్డు వేసి కనెక్టివిటీ అందిస్తామని హామీ ఇచ్చారు.  వీలైనంత త్వరగా రోడ్డు పనులను కంప్లీట్ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.  కార్యక్రమంలో తహసీల్దార్ సరిత రాణి, ఇంజనీర్ సురేందర్ తదితరులు ఉన్నారు.

పకడ్బందీగా వడ్లు కొనుగోలు చేయాలి

వానాకాలపు వడ్ల కొనుగోలును రైతుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సన్న, దొడ్డు వడ్లు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రెండింటికి వేరువేరుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.

ఆరు మిల్లీమీటర్ల కంటే తక్కువ వెడల్పు రెండు మిల్లి మీటర్ల కంటే ఎక్కువ కాకుండా సన్న వడ్లను గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, విమల, పుష్పమ్మ, స్వామి కుమార్ తదితరులు ఉన్నారు.