గృహ జ్యోతి పథకం వినియోగదారులకు వరం : రాహుల్​రాజ్

  • కలెక్టర్​ రాహుల్​రాజ్

మెదక్, వెలుగు: గృహజ్యోతి పథకం విద్యుత్​ వినియోగదారులకు వరమని కలెక్టర్​రాహుల్​రాజ్​అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా శుక్రవారం మెదక్ పట్టణంలోని టీఎస్ ఎన్పీడీసీఎల్ ఆఫీస్​లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో  గృహ జ్యోతి పథకంపై  కార్యక్రమం నిర్వహించారు.  కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1 లక్ష , 26 వేల గృహా వినియోగదారులు రూ.31.36 కోట్ల సబ్సిడీని వినియోగించుకున్నారని  తెలిపారు. ఇంకా 12 వేల మంది గృహ జ్యోతిలో నమోదు కావాల్సి ఉందని విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారులు నియమించి వారందరికీ లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు రూ.92.72 కోట్లు, ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు రూ.3.35 కోట్లు , నాయీ బ్రాహ్మణులు, రజకులకు రూ.3.22 కోట్లు విద్యుత్ వినియోగం ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. జిల్లాలో 8 సబ్ స్టేషన్స్ కొత్తగాఏర్పాటు చేయనున్నారని, 25 కేవీ, 63 కేవీ, 160 కేవీ ట్రాన్స్​ఫార్మర్స్​ ద్వారా లోవోల్టేజ్ నిర్మూలనకు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రాన్స్​కో ఎస్ఈ శంకర్, మెదక్​ డీఈ చాన్ షరీఫ్ బాషా, తూప్రాన్ డీఈ గరుత్మంత రాజు పాల్గొన్నారు.

 అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు 

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని కలెక్టర్ రాహుల్​ రాజ్​తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సర్వే నిర్వహణ, అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం శుక్రవారం  కలెక్టరేట్ నుంచి అడిషనల్​కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీపీవో యాదయ్య, ఈడీఎం సందీప్ , ఎంపీడీవోలతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిరుపేద మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, ట్రాన్స్ జెండర్లకు, గిరిజన, దళిత కుటుంబాల వారికి ఇళ్ల మంజూరీలో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అర్హులైన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేసేలా ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తూ సర్వే యాప్ ద్వారా ఎంపిక చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపల్ డివిజన్లు, వార్డుల్లో అధికారులతో కూడిన బృందాలు పర్యటిస్తూ ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే నిర్వహణ కొనసాగుతుందన్నారు.  గడువు లోగా సర్వే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను ఆదేశించారు.

పదో తరగతి మార్కులే భవిష్యత్​లో కీలకం 

చిన్నశంకరంపేట: పదో తరగతి మార్కులే భవిష్యత్​లో కీలకమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం ఆయన చిన్నశంకరంపేట మోడల్ స్కూల్, కేజీబీవీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోడల్ స్కూల్​లో పదోతరగతి స్టూడెంట్స్​కు గణితం బోధించారు.10 జీపీఏ లక్ష్యంగా పెట్టుకొని చదవాలని స్టూడెంట్స్​కు సూచించారు. అనంతరం కేజీబీవీ స్కూల్​లో కిచెన్ రూమ్ లో సరుకులను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్​మన్నన్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీవాణి, కేజీబీవీ ఎస్ వో గీత ఉన్నారు.