ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి

  • వినతులు స్వీకరించిన కలెక్టర్లు, అధికారులు

మెదక్​ టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్​రాహుల్​రాజ్​అన్నారు. సోమవారం మెదక్​కలెక్టరేట్​లో అడిషనల్​కలెక్టర్​వెంకటేశ్వర్లుతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని సమస్యలు తహసీల్దార్ ఆఫీసులో అందించాలని సూచించారు. ప్రజావాణికి మొత్తం 35 దరఖాస్తులు రాగా అందులో రుణమాఫీ 2, పింఛన్లు 1, డబుల్​ బెడ్​రూమ్1, భూసమస్యలకు సంబంధించి 15, ఇతర సమస్యలకు సంబంధించి 16 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వీటికి సంబంధించిన వివరాలను వెబ్​సైట్​లో అప్​లోడ్​ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ శ్రీనివాస్​రావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీపీవో యాదయ్య, డీఏవో గోవింద్, డీఈవో రాధాకిషన్, జిల్లా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

సంగారెడ్డి టౌన్: ప్రజావాణి సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని కలెక్టర్ క్రాంతి అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో అడిషనల్​కలెక్టర్ మాధురి, డీఆర్ వో పద్మజారాణితో కలిసి ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారని అధికారులు వినతులు స్వీకరించి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు.జిల్లా వ్యాప్తంగా ప్రజావాణికి 35 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో రెవెన్యూ 17, ల్యాండ్ సర్వే 4, డీఆర్డీవో 4, మెప్మా 3, మున్సిపల్ 1, వెల్ఫేర్ డిపార్ట్​మెంట్​2, చొప్పున దరఖాస్తుల వచ్చాయన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు,  సిబ్బంది పాల్గొన్నారు.

సిద్దిపేట టౌన్: సిద్దిపేట కలెక్టర్ ఆఫీసులో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులతో కలిసి ఆయన అర్జిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.  అనంతరం మాట్లాడుతూ.. ప్రజావాణి గొప్ప కార్యక్రమం అని, సామాన్యులకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించుకోవడానికి ఉత్తమ వేదిక అన్నారు. కాగా ధరణి, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఆసరా పింఛన్లు తదితర సమస్యల పై మొత్తం 29 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో జయదేవ్ ఆర్యా, డీఆర్ వో నాగరాజమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

నాలుగేళ్లకు సమస్య పరిష్కారం

కొండాపూర్: ధరణి పోర్టల్ లో సాంకేతిక సమస్య కారణంగా నాలుగేళ్లుగా పట్టా పాస్​పుస్తకం కోసం తిరుగుతున్న రైతు కుటుంబాలకు కలెక్టర్​ క్రాంతి కొత్త పట్టాదారు పాస్​ పుస్తకాలు అందజేశారు. సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన  కొల్ల లక్ష్మారెడ్డి,  రాంరెడ్డి, బల్వంత్ రెడ్డి ధరణి అమల్లోకి వచ్చినప్పటి నుంచి పాసుపుస్తకం రాకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం గురించి పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. రెండు నెలల కింద ప్రజావాణి కార్యక్రమంలో సమస్యను కలెక్టర్ క్రాంతి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె స్పందించి సోమవారం కొత్త పాస్​ పుస్తకాలను అందజేశారు.