రైతు బీమా స్వాహాపై కలెక్టర్​ సీరియస్​

  • విచారించకుండానే డెత్​ సర్టిఫికెట్లు ఇచ్చారా? 
  • విలేజ్ సెక్రటరీలు, ఏఈవోల పాత్రపై అనుమానం

మెదక్, వెలుగు: దొంగ డెత్ సర్టిఫికెట్లతో రైతు బీమా సొమ్ము కాజేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి మెదక్ మండలంలోనే మూడు సంఘటనలు వెలుగు చూడడంతో జిల్లాలో ఇంకెంత మంది రైతు బీమా సొమ్ము కాజేశారో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబానికి ఆధారమైన రైతులు చనిపోతే వారిపై ఆధారపడిన వారు ఇబ్బంది పడకూడదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. 

ఎల్ఐసీతో ఒప్పందం చేసుకొని భూమి ఉన్న రైతుల పేర్ల మీద రూ.5 లక్షల బీమా చేయించింది. అందుకు అవసరమైన ప్రీమియం డబ్బులు ప్రభుత్వమే చెల్లించింది. గడిచిన మూడేళ్లలో జిల్లా వ్యాప్తంగా చనిపోయిన 2,436 మంది రైతు కుటుంబాలకు రైతు బీమా కింద రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.121 కోట్లు మంజూరయ్యాయి. 

విచారించకుండానే..

రైతులు ఎవరైనా చనిపోతే సంబంధిత అధికారులు పక్కాగా విచారించిన తర్వాత నామినీకి రైతు బీమా సాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలి. విలేజ్ సెక్రటరీ గ్రామంలో విచారణ జరిపి రైతు మృతి చెందారని పక్కగా నిర్ధారించుకున్న తర్వాతనే జీపీ రికార్డుల్లో నమోదు చేయాలి. ఆ తర్వాతనే ధ్రువీకరణ పత్రం జారీ చేయాలి. సంబంధిత కుటుంబ సభ్యులు రైతు బీమా కోసం దరఖాస్తు చేస్తే ఏఈవో స్వయంగా గ్రామానికి వెళ్లి చనిపోయిన విషయం వాస్తవమా? కాదా? అనేది చెక్ చేయాలి. నామినీ సమర్పించిన డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సరైనవా కాదా నిర్ధారించాలి. అన్నీ పక్కగా ఉంటేనే బీమా క్లెయిమ్ కోసం ఎల్ఐసీకి సిఫారసు చేయాలి. 

విచారణకు కలెక్టర్​ఆదేశాలు

ఉమ్మడి మెదక్ మండలంలో రైతు బీమా సొమ్ము స్వాహాపై మూడు సంఘటనలు వెలుగు చూడగా కలెక్టర్​ రాహుల్​ రాజ్​ విచారణకు ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్​ఈడీని విచారణాధికారిగా నియమించారు. గుట్టకింద పల్లి, బూర్గుపల్లిలో అక్రమంగా రైతు బీమా సొమ్ము కాజేసిన వ్యవహారంలో విలేజ్​సెక్రటరీలు, ఏఈవో, ఏవోల పాత్రపై విచారణ  చేయనున్నారు