గ్రౌండ్ బేస్ లెర్నింగ్ ప్రారంభం : కలెక్టర్ క్రాంతి

  • టీచర్​గా మారిన కలెక్టర్ ​రాహుల్​రాజ్​
  •  పిల్లలకు బాల్యం విలువైనది: కలెక్టర్ క్రాంతి 

మెదక్, వెలుగు: జిల్లాలో అన్ని హై స్కూళ్లలో గ్రౌండ్ బేస్ లెర్నింగ్ విధానాన్ని ప్రారంభించేలా పకడ్బందీగా ప్రణాళికలు తయారు చేయాలని విద్యాధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. గురువారం తెలంగాణ గురుకుల బాలికల కాలేజీ, స్కూల్​లో గ్రౌండ్ బేస్ లెర్నింగ్ విధానాన్ని డీఈవో రాధాకిషన్​, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ టీచర్​ గా మారి 9వ తరగతి స్టూడెంట్స్​కు ఫిజిక్స్​ బోధించారు. అనంతరం ప్రశ్నలతో వారి సామర్థ్యాలను పరీక్షించి వారిని అభినందించారు. 

త్వరలో జిల్లాలో ఉన్న సైన్స్, మాథ్స్​ టీచర్లకు గ్రౌండ్ బేస్ లెర్నింగ్ పై ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని, వారు శిక్షణ పొందిన అనంతరం అన్ని స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసినట్లయితే స్టూడెంట్స్​సామర్థ్యాలను మెరుగుపరిచి భవిష్యత్​కు పునాదులుగా వేసిన వాళ్లమవుతామని కలెక్టర్ తెలిపారు. అనంతరం అగస్త్య ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న సైన్స్ మేళాను సందర్శించి నిర్వాహకులను అభినందించారు. ఆయన వెంట ఎంఈవో నీలకంఠం, రిసోర్స్ పర్సన్ ప్రభు, ప్రిన్సిపాల్ తారా సింగ్ ఉన్నారు. 

పిల్లలకు బాల్యం విలువైనది

సంగారెడ్డి టౌన్: పిల్లలకు బాల్యం చాలా విలువైనదని కలెక్టర్ క్రాంతి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని సహారా ప్రైమరీ రిహబిలేషన్ సెంటర్​లో బాలల దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రిహబిలేషన్​ సెంటర్​లో దివ్యాంగ పిల్లలకు సేవలందించబడం మానవత్వానికి నిదర్శనమన్నారు. విద్యావంతులైన ప్రత్యేక సిబ్బందితో వారికి విద్య, ఆరోగ్యం, జీవన నైపుణ్యాలు అందించడం ద్వారా వారి భవిష్యత్​కు పునాది వేసినవారమవుతున్నామన్నారు.  అనంతరం పిల్లలతో ముచ్చటించి వారి అభిరుచులను 
తెలుసుకున్నారు. 

 సర్వేలో ఎలాంటి తప్పులు చేయొద్దు

సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలో కలెక్టర్  క్రాంతి సామాజిక కుటుంబ సర్వేను పరిశీలించారు. ఎన్యూమరేటర్లు ఎలాంటి తప్పులు లేకుండా ఫారమ్​లు నింపాలన్నారు. ప్రజలు సరైన సమాచారం అందించి అధికారులకు సహకరించాలన్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతుల సమస్యలు తెలుసుకొని వాటికి తగిన పరిష్కారాలు చూపాలని అధికారులను ఆదేశించారు. రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్ దేవదాస్, ఎంపీడీవో సురేందర్ రెడ్డి, ఏఈవోలు ఉన్నారు.