జోరందుకున్న ధాన్యం కొనుగోళ్లు..48 గంటల్లో రైతులకు చెల్లింపులు

  • కలెక్టర్​ రాహుల్​రాజ్

నర్సాపూర్, వెలుగు : జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ శరవేగంగా జరుగుతోందని కలెక్టర్ రాహుల్ రాజ్  తెలిపారు.ఆదివారం నర్సాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ..ఖరీఫ్ కు సంబంధించి ఇప్పటి వరకు 18వేల 700 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వెల్లడించారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరపాలని, ప్రతి రోజు ఒక్కో కేంద్రం నుంచి కనీసం నాలుగైదు లారీల ధాన్యం రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు.

గన్నీ బ్యాగులు, లారీల కొరత వంటి సమస్యలుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. 48 గంటల్లో  రైతులకు బిల్లుల చెల్లింపులు జరిగేలా ఓపీఎంఎస్ లో డాటా ఎంట్రీ చేయిస్తున్నామని తెలిపారు. రైతులకు సన్న ధాన్యానికి సంబంధించి క్వింటాలుకు రూ. 2320 ముందుగా చెల్లిస్తున్నామని, అనంతరం రూ. 500 బోనస్ ను ప్రభుత్వం అందిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

రోజువారి సర్వే నివేదికలను అందించాలి

ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ఎన్యూమరేటర్లు పక్కాగా వివరాలు నమోదు చేయాలని కలెక్టర్  రాహుల్ రాజ్ పేర్కొన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో  నిర్వహిస్తున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేలో ప్రతి కుటుంబం పాల్గొనే విధంగా ప్రజలను చైతన్యపరిచేలా ప్రచారం చేపట్టాలన్నారు.

సర్వే పూర్తి కాగానే గూగుల్ షీట్ లో అప్​లోడ్​చేసి పూర్తి సమాచారం జిల్లా కేంద్రానికి అందించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, పీఎసీఎస్ చైర్మన్ రాజు యాదవ్, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు, ఆఫీసర్లు పాల్గొన్నారు.