మూడు రోజుల రైతు పండగ ప్రారంభం : కలెక్టర్​ రాహుల్​రాజ్

మెదక్​టౌన్, వెలుగు: రైతుల అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలపై అవగాహన కల్పించేందుకు మూడు రోజుల రైతు పండుగ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్​ రాహుల్​రాజ్​తెలిపారు. గురువారం ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రైతుపండగను కలెక్టరేట్​ఆవరణలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఏడాది కాలంలో రైతుల కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. 

అనంతరం కలెక్టర్ రాహుల్​ రాజ్​ మాట్లాడుతూ.. రైతు భరోసా పథకం కింద 2,63,933 మంది రైతులకు రూ.194.54 కోట్లు, రుణ మాఫీ కింద 82,294 రైతులకు రూ. 604.21 కోట్లు, రెండో విడత రూ. 204.40 కోట్లు, రైతు బీమా కింద 1,029 రైతు కుటుంబాలకు రూ.54 కోట్లు చెల్లించామని వివరించారు. పచ్చిరొట్ట, జీలుగ, జనుము విత్తనాలను పంపిణీ చేశామన్నారు. అనంతరం రైతుపండగ పోస్టర్​ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఏవో గోవింద్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ సురేశ్, డీఆర్డీవో శ్రీనివాసరావు, డీసీవో కరుణ, రైతుసంఘాల నాయకులు, రైతులు, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు. 

మెనూ ప్రకారం భోజనం పెట్టాలి ​

పాపన్నపేట: స్టూడెంట్స్​కు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, వంట సరుకుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గురువారం మండల పరిధిలోని కొత్తపల్లి బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి మాట్లాడారు. హాస్టల్​పరిసర ప్రాంతాలు, వంట పదార్థాలను పరిశీలించారు. అనంతరం కొత్తపల్లి హై స్కూల్​ను సందర్శించారు. స్టూడెంట్స్ కు ప్రశ్నలు వేసి వారి సామర్థ్యాలను తనిఖీ చేశారు. 

గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులను ఇబ్బంది పెట్టొద్దని సిబ్బందికి సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 1,80,463 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.250 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. ఆయన వెంట సొసైటీ చైర్మన్ రమేశ్ గుప్తా, వార్డెన్ సుధాకర్, టీచర్లు ఉన్నారు.