పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు రానివ్వొద్దు : కలెక్టర్ ప్రతీక్ జైన్

  • వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్

వికారాబాద్, వెలుగు: రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా   పత్తిని కొనాలని  కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు.  మంగళవారం కలెక్టరేట్​లో   అధికారులు, ట్రేడర్లతో  మీటింగ్​ నిర్వహించారు.  జిల్లాలో   సుమారు  2లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని, 2024–25 సీజన్ పత్తి కొనుగోలు ప్రారంభం కానున్న నేపథ్యంలో  జిన్నింగ్ మిల్లులు వద్ద  ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు.   

ఆన్​లైన్​లో  లేని  రైతుల లిస్టుకు ఏఈఓ  సర్టిఫై  చేస్తే ఆన్ లైన్  ధృవీకరణ ఇవ్వాల్సి ఉంటుందని, నకిలీ దృవీకరణ సర్టిఫికెట్లు జారీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సంవత్సరం  కేంద్ర ప్రభుత్వం గ్రేడ్ వన్ కు  మద్దతు ధర రూ. 7,521 , గ్రేడ్ -2 రకానికి రూ. 7,121  మద్దతు ధర ఉందని తెలిపారు. 

 ప్రభుత్వ సెలవు రోజుల్లో రైతులు ఎవరూ  జిన్నింగ్ మిల్లులకు పత్తి తీసుకురావొద్దన్నారు.  ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, మార్కెటింగ్ అధికారి సారంగపాణి, వ్యవసాయ అధికారి మోహన్  రెడ్డి,  అడిషనల్  ఎస్పీ రవీందర్ రెడ్డి, సీసీఏ బ్రాంచ్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.