ప్రజావాణి ఫిర్యాదులకు పరిష్కారం చూపాలి

  • కలెక్టర్ ​మనుచౌదరి, అడిషనల్​ కలెక్టర్లు నగేశ్, మాధురి

సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులకు సత్వరమే పరిష్కారం చూపాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి మొత్తం 77 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వాటిని సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ఈ సందర్భంగా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణంతో నిర్వాసితులైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు శశిధర్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. తమను వేధింపులకు గురిచేస్తున్న జగదేవ్ పూర్ మండల ఐకేపీ ఏపీఎం కిరణ్ కుమార్, సీసీలు రమేశ్ రెడ్డి, బాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల మహిళా వీవోఏలు కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. అంతకుముందు  మైనారిటీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 136వ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్​వో నాగరాజమ్మ, వివిధ శాఖల అధికారులు  పాల్గొన్నారు.

మెదక్​ టౌన్: అధికారులు ప్రజలకు జవాబుదారీగా పని చేయాలని అడిషనల్​కలెక్టర్​నగేశ్​అన్నారు. మెదక్​కలెక్టరేట్​లో నిర్వహించిన  ప్రజావాణి కార్యక్రమంలో ఆయన అధికారులతో కలిసి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అడిషనల్​కలెక్టర్​మాట్లాడుతూ.. ప్రజావాణికి మొత్తం 65 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఇందులో ధరణి17, డబుల్​బెడ్​రూమ్స్​4,  ఇతర సమస్యలు 44 ఉన్నట్లు పేర్కొన్నారు.  కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో పీడీ శ్రీనివాస్​రావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

 
సంగారెడ్డి టౌన్: ప్రజావాణికి 39 ఫిర్యాదులు అందాయని అడిషనల్​కలెక్టర్ మాధురి తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను  అడిషనల్​కలెక్టర్, డీఆర్​వో పద్మజారాణి, ఇతర అధికారులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమంపై ప్రజల్లో విశ్వాసం పెంచేలా సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడూ పరిశీలన చేస్తూ సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో జానకిరెడ్డి, డీపీవో సాయిబాబా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.